Sabitha Indra Reddy | సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత నియోజకవర్గంలోని ప్రజలు సమస్యల్లో ఉంటే రేవంత్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. లగచర్ల అంశంపై అసెంబ్లీలో చర్చించే దమ్ము కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు.
కొడంగల్ ప్రజల్లో పట్నం నరేందర్ రెడ్డినే కనిపిస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొడంగల్ నరేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. అసెంబ్లీలో లగచర్ల రైతుల కోసం కొట్లాడాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. కానీ లగచర్ల అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము లేదని ఆమె విమర్శించారు. సొంత నియోజకవర్గ ప్రజలు సమస్యల్లో ఉంటే రేవంత్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. రెండు రోజుల నుంచి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కనిపించడం లేదని తెలిపారు. చర్చిద్దాం రండి అంటే అసెంబ్లీకి ఎందుకు వస్తలేవని రేవంత్ రెడ్డిని నిలదీశారు. గట్టిగా మాట్లాడుతున్నందుకే కేటీఆర్‌ను అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు.
కుమ్రంభీం స్ఫూర్తితో లగచర్ల రైతుల పోరాటం కొనసాగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. లగచర్ల పోరాటానికి దేశ రాజకీయాలను మార్చే శక్తి ఉందని పేర్కొన్నారు. విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన జాతి మనది అని అన్నారు. దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాడిన థానునాయక్ ఇవాళ లగచర్ల జ్యోతిలో కనిపిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశానికి రాకుండా హైదరాబాద్ సరిహద్దుల్లో ఎంతోమందిని అడ్డుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కోసం కేటీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. యూరప్ నగరాలకు ధీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కేటీఆర్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.
లగచర్ల రైతుల విషయంలో బీఆర్ఎస్ పోరాటంతో రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అసెంబ్లీలోనూ లగచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. గడపదాటని ఆడబిడ్డలు ఢిల్లీకి వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారని పేర్కొన్నారు. లగచర్ల రైతులపై కేసులు కొట్టేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.