RS Praveen Kumar | హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వసూల్ రాజా సీఎం అయితే అధికారులందరూ సుద్దపూసలైతరా..? అని ప్రశ్నించారు.
ఇంతవరకు ఏసీబీ అధికారులు ఒక్క అవినీతి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముట్టుకోలేదు.. ఎందుకని అని ఆర్ఎస్పీ నిలదీశారు. ఎవరినైనా జైలుకు పంపించాలన్నా వాళ్లు బరాబర్ బహుజనులై ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఐపీఎస్ ఎన్ సంజయ్ (AP Cadre), ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ (AP) ని కూడా జైలుకు పంపించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆయన మీద ఎలాంటి ఆధారాలు దొరకలేదు కావున వేరే తుఫైల్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారని ఆర్ఎస్పీ తెలిపారు.
నాలుగు నెలల్లోనే రూ. 50 కోట్లు మింగిన అగ్ర సివిల్ తిమింగలాలను వదిలేసి పాపం ఆ చిన్న హైదరాబాద్ విద్యుత్ ఇంజినీర్ అంబేద్కర్‌ను మొన్న జైలుకు పంపారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిండని మొన్న గొర్రెల స్కాం అని డైరెక్టర్ డా. రాంచందర్ నాయక్ (ST) ని ఏసీబీ అధికారులు 65 రోజులు జైల్లో పెట్టారు. ఆయన ఇంట్ల ఒక్క పైసా కూడా దొరకలేదు. కేసీఆర్ మీద కోపంతో భూక్యా హరిరాం(ST) సీఈని కూడా 60 రోజులు జైల్లో పెట్టారని తెలిపారు.
హైదరాబాద్ సీసీఎస్‌లో ఒక పెద్ద రియల్ స్కాంను పరిశోధిస్తున్న ఒక నిజాయితీ ఏసీపీని రేవంత్ రెడ్డి అంతర్గత కోటరీలో ఉన్న ఒక మాజీ కానిస్టేబుల్ వార్నింగ్ ఇచ్చి మరీ ఏసీబీ కేసు పెట్టి జైలుకు పంపించారు. ఇదంతా కాదు గాని సీఎం కోటరీలో ఉన్న ఒక అధికారి హెచ్ఎండీఏ, ట్రిపుల్ ఆర్ పరిధిలో వేల కోట్ల ఆర్ఆర్ ట్యాక్స్ అంతా తనే వసూలు చేస్తున్నడంట. ఆయనపై ఒక కన్నేసి మీ పారదర్శకత-నిజాయితీ ని నిరూపించుకోండి అని ఏసీబీకి సూచించారు. చిన్నోళ్లను అనవసరంగా టార్గెట్ చేయకండి అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. గౌరవ న్యాయస్థానాలు పై విషయాలను గమనించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనవి చేశారు. .