పెద్దపల్లి, జనవరి 12 : ‘రాష్ట్రంలో నడుస్తున్నది రాజ్యాంగ పాలన కాదు.. రాక్షస పాల న.. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేస్తున్నది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కి అక్రమ కేసులు పెడుతున్నది’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. శనివారం పెద్దపల్లికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తూ రాష్ట్ర ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు నమోదు చేయించి రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు భయపడరని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తారని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు, బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడానికి రేవంత్‌రెడ్డి గురుకులాలను నాశనం చేస్తున్నారని, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనై పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోగా, కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కే తాను ముక్కలని, రేవంత్‌రెడ్డి (బీఎస్ఎఫ్)బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్‌గా, బండి సంజయ్ (ఆర్పీఎఫ్) రేవంత్‌రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్‌గా మారారని ఆరోపించారు.