RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. కార్పొరేట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బహుజనులకు తీరని అన్యాయం చేస్తుందంటూ ఆర్ఎస్పీ మండిపడ్డారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకం పెట్టి ప్రతి నియోజకవర్గం నుండి ఎస్సీలను వ్యాపారరంగంలోకి అడుగుపెట్టేలా చేసి, ఎవరి కాళ్ల మీద వాళ్లు ఆత్మగౌరవంతో నిలబడేలా చేసింది. అంతేకాదు, ఎస్సీలు పారిశ్రామిక రంగంలో రాణించాలని, కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) లో 40 శాతం మినహాయింపును ఇచ్చి ప్రోత్సహిస్తే.. తాజాగా గురుకులాల టెండర్లలో కూడా ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలే. రేవంత్ రెడ్డి -కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం EMD మినహాయింపు లేకుండా చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంట్రాక్టర్లుగా పనికిరారని పరోక్షంగా చెబుతూ వివక్ష చూపుతుంది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు.
చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో మల్లికార్జున్ ఖర్గేను తీసుకొచ్చి, దళిత బంధు పథకం కింద ఎస్సీలకు 12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్కరికీ ఇవ్వలేదు. ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్టుల్లో 18 శాతం రిజర్వేషన్లు ఇస్తామని 18 నెలల కాలంలో ఒక్క కాంట్రాక్ట్ కూడా ఎస్సీ, ఎస్టీ లకు ఇవ్వలేదు. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ పార్టీ దళితులకు వ్యతిరేకమైనవి. ఖర్గే గారు మీ మోసాన్ని మా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తరంట! అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.