హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పోడు భూముల కోసం రైతులు చేస్తున్న పోరాటాలను అక్రమ అరెస్టులతో ఆపలేరని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. తమ పోడు భూములను రక్షించాలన్న డిమాండ్‌తో దిందా గ్రామ ప్రజలు పాదయాత్రగా బయలుదేరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు వస్తుండగా, మధ్యలోనే పోలీసులు అరెస్టు చేసి, అక్రమ కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పాదయాత్రకు బీఆర్ఎస్ పార్టీ మార్గమధ్యంలోనే మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఇతర నాయకుల అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నదని తెలిపారు. పాదయాత్ర చేస్తూ గజ్వేల్‌కు చేరుకున్న దిందా గ్రామస్థులను అర్ధరాత్రి వాహనాల్లో ఎక్కించి, ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు చెప్పలేదని మండిపడ్డారు.
అరెస్టుచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను, ఇతర బీఆర్ఎస్ నాయకులను, రైతులను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్ఎస్ నేతలు అండగా ఉండటమే నేరమా? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా.. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు ఎక్కడకు పోయారని రావుల నిలదీశారు. కేసీఆర్ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చామని, ఆయా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత సర్కారు నిర్ణయాలు తీసుకున్నదని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోడు రైతులకు కష్టాలు మొదలయ్యాయని, వారికి అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పోడు రైతులకు అండగా ఉంటుందని స్పష్టంచేశారు. వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.