హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బీజేపీ నేతలు కాంగ్రెస్ పెద్దలకు కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. అమృత్ స్కాంపై బీజేపీ కేంద్ర మంత్రుల మాటలు చూస్తుంటే ఇవి నిజమనిపిస్తున్నదని చెప్పారు. అమృత్ సాం పై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి స్పందనల తీరు హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌కు లేఖ రాయాలని కోరడం విచిత్రంగా ఉన్నదని, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను కాపాడే పనిలో బండి సంజయ్ ఉన్నట్టు అర్థమవుతున్నదని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి కేంద్రంలో మంత్రిగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. తనపైనే ఆరోపణలు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సీవీసీ, సీబీఐకి లేఖ రాస్తుందా? అని ప్రశ్నించారు.
ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మహేశ్వర్ రెడ్డి సీబీఐ, ఈడీ విచారణ చేయాలని మాట్లాడి ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదని నిలదీశారు. అమృత్ మీద మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు. ఇప్పుడు సీబీఐ విచారణ కోరాలని మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ పార్టీయే కదా? అని ధ్వజమెత్తారు.
మోదీ ఎకడికెళ్లినా బీజేపీయేతర ప్రభుత్వాలకు కేంద్ర నిధులు ఏటీఎంగా మారాయంటారని, మరి అమృత్ నిధులు తెలంగాణలో దుర్వినియోగమవుతుంటే విచారణకు ఎందుకు ఆదేశించరని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి కూడా నోరు మెదపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ అవినీతి మీద బీజేపీ ఉద్యమిస్తుంటే తెలంగాణలో నోరు మూసుకున్నదని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా అమృత్ సాంపై విచారణ కోసం బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.