హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపబోమని, ప్రజల పక్షానపోరాటం చేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్‌రెడ్డి స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆధారంగా తనపై అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లీగల్ సభ్యుడు, న్యాయవాది జక్కుల లక్ష్మణ్‌తో కలిసి గురువారం నాంపల్లి కోర్టులో హాజరైనట్టు తెలిపారు.
విచారణను కోర్టు మార్చి 21కి వాయిదా వేసిందని చెప్పారు. కోల్ సామ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, గడ్డం వినోద్‌ను ప్రశ్నించినందుకు తనపై కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఆఘమేఘాల మీద తనపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని, బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. ఎన్ని రకాలుగా వేధించాలని చూసినా భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. న్యాయమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.