హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి బీసీ వ్యతిరేకి అని బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావు విమర్శించారు. తమది పాలించే సామాజిక వర్గమని, తమ వర్గమే పాలన సాగించాలని అహంకారపూరితంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరాపార్క్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభ విజయవంతం కావడంతో ప్రభుత్వంలో భయం మొదలైందని చెప్పారు. బీసీల పక్షాన పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితను కాంగ్రెస్ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. 70 ఏండ్లుగా బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు మాట్లాడే హక్కు ఉన్నదా? అని నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, షబ్బీర్‌అలీ బీసీ డిక్లరేషన్ అమలుచేయాలని ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడంలేదని ధ్వజమెత్తారు.
బీసీల ఆత్మగౌరవానికి దన్నుగా నిలుస్తుంటే విమర్శలా?
బీసీల హక్కులు, ఆత్మగౌరవాన్ని సాధించేందుకు మద్దతుగా నిలుస్తున్న కవితన విమర్శించడం సిగ్గుచేటని రామచందర్‌రావు మండిపడ్డారు. ‘అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటుచేయాలని ఎమ్మెల్సీ కవిత కోరడం తప్పా? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అడగటం తప్పా? కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలుచేయాలని కోరడం తప్పా? ఇవన్నీ తప్పని కాంగ్రెస్ బీసీ నాయకులు ఒప్పుకుంటారా? బీసీ ద్రోహి అయిన రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తారా?’ అని రామచందర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.