హైదరాబాద్, అక్టోబరు 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయని, ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని ధ్వజమెత్తారు. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో పరిస్థితులు ఇందుకు అద్దంపడుతున్నాయని ఆరోపించారు.
సోమవారం తెలంగాణ భవన్లో రాకేశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ‘రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలోని ఉమ్మడి తొమ్మిది జిల్లాలు వెనకబడిన జిల్లాలుగా ఉండేవి. కానీ గడిచిన పది సంవత్సరాల్లో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్రమంగా కుంటుపడుతున్నది. తొమ్మిది నెలల్లో ప్రభుత్వానికి రూ.89 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.73 వేల కోట్లు మాత్రమే వచ్చాయి.
అందులోనూ అభివృద్ధి పనుల కోసం రూ.8 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. మరోవైపు కాంగ్రెస్ పాలన ఇల్లు పీకి పందిరేసినట్టు ఉన్నది. ప్రభుత్వ విధానాల వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. టెక్స్టైల్ పరిశ్రమ కుంటుపడింది. గ్రామ పంచాయతీ కార్మికులకు తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. పీఆర్సీ పత్తా లేదు’ అని ధ్వజమెత్తారు.
రుణమాఫీపై సీఎం మాటలు అబద్ధం
రుణమాఫీపై ప్రధానికి రాసిన లేఖతో రేవంత్‌రెడ్డి బండారం బయటపడిందని, రూ.18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామని సీఎం ఒప్పుకున్నారని రాకేశ్‌రెడ్డి తెలిపారు. రేవంత్‌రెడ్డి రావడంతోనే కూల్చుడు మొదలు పెట్టారని, ఆయన విధ్వంసం వైపు అడుగులు వేస్తున్నారని చెప్పారు. మూసీ ప్రక్షాళన కాదు.. రేవంత్ రెడ్డి మైండ్ ప్రక్షాళన జరుగాలన్నారు. మూసీ సుందరీకరణతో వచ్చే ఆదాయం ఏంటో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు లాభం జరుగుతుందని, మూసీ సుందరీకరణ ఎవరికి అన్నం పెడుతుందంటూ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు డీపీఆర్ ఎకడ ఉన్నదని, ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌తో రేవంత్ రెడ్డి ముందే కుమ్మకు అయ్యారని ఆరోపించారు. హైడ్రాను వెనకి తీసుకోవాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.