Rakesh Reddy | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది అని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఏదో ఒక మూలన కూల్చివేతలు రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. వరంగల్, నాగర్ కర్నూల్లో రోడ్డు పక్కన ఉన్న పేదల షాపులను కూల్చారు. అందగత్తెల కోసం రోడ్డు పక్కన పేద ప్రజల షాపులను కూలుస్తారా? అందగత్తెలను తీసుకువచ్చి అందమైన గోడలను చూపెడితే అందం వస్తుందా? అందమైన పాలనతో రాష్ట్రానికి అందం వస్తుంది. బుల్డోజర్ తీసుకువచ్చి కూలగొట్టడం ప్రజాపాలనా? ప్రజలతో మాట్లాడి సమస్యలను ఎందుకు పరిష్కరించరు? రాష్ట్రంలో కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కువ జరుగుతున్నాయి. హైడ్రా, మూసీ, లగచర్ల, హెచ్‌సీయూ, వరంగల్, నాగర్ కర్నూల్లో పేదలపై దాడి చేస్తున్నారు అని రాకేశ్ రెడ్డి మండిపడ్డారు.
కేటీఆర్ ఎస్400 మిస్సైస్లా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. రైతుబంధుకు డబ్బులు లేవని అందాల పోటీలకు రూ. 200 కోట్లు ఖర్చు పెట్టారు. అబద్దాలు చెప్పి ఆకాశంలో విహరిస్తే ప్రభుత్వానికి అందం రాదు. రాష్ట్రం పరువు పోయిందని అందాల పోటీలతో పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందాల పోటీలతో రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి? కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తే, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఫార్ములా-ఈ రేస్ రద్దు చేశారు. ఫార్ములా-ఈ రేస్‌తో రాష్ట్రానికి రూ. 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని నీల్సన్ అనే సంస్థ చెప్పింది. ఫార్ములా-ఈ రేస్‌పై, కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లింది. ఫార్ములా-ఈ రేస్ నిర్వహిస్తే సినీ, క్రీడా ప్రముఖులు వచ్చారు. అందాల పోటీలతో రూపాయి లాభం లేదు. అందాల పోటీ నిర్వహణ ప్రభుత్వానికి చేతకావడం లేదు. అందాల పోటీకి వచ్చిన గెస్టులను గచ్చిబౌలికి తీసుకువెళ్లి వచ్చిన కంపెనీలను చూపించాలి అని రాకేశ్ రెడ్డి సూచించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి అలెర్ట్ మెసేజ్‌లు వచ్చినా.. అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వరిధాన్యం నీళ్ల పాలు అవుతోంది.. కానీ అందాల పోటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉంది. అందాల పోటీలపై సీఎం రివ్యూలు చేస్తున్నారు కానీ రైతుల సమస్యలపై ఒక్క రివ్యూ చేయడం లేదు. ప్రభుత్వం కూల్చివేతలు ఆపాలి. ప్రభుత్వం కూల్చిన షాపులకు చెందిన చిరు వ్యాపారులకు నష్ట పరిహారం ఇవ్వాలి అని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.