హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సంవత్సరం మారినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీజీపీఎస్సీ తీరు మారడంలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. పాత సంవత్సరంలో పండుగలు వచ్చాయి కానీ, ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీజీపీఎస్సీ ఈ సంవత్సరం కూడా క్యాలెండర్‌ను పండగలతో నింపుతారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌ను ఉద్యోగాలు, నోటిఫికేషన్ తేదీలతోసహా వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇవ్వగా, ఆయా ఉద్యోగాలను తామే ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వ సొమ్ము రూ.కోట్లలో వెచ్చించి పత్రికా ప్రకటనలివ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి, 50 వేలు ఇచ్చామని చెప్పుకుంటున్నదని మండిపడ్డారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను చాయ్ తాగే టైంలో రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల సమయంలో వరంగల్‌లో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కేంద్రం పరిధిలోకి వస్తుందంటూ మాట మార్చారని దుయ్యబట్టారు.
వీఆర్వోలు సర్వే పని ఎలా చేస్తారు?
బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ శాఖల్లో పోస్టింగులిచ్చిన వీఆర్వోలను సర్వేయర్లుగా ఎలా నియమిస్తారని రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరితో ఏ పని చేయించాలో కూడా తెలియని తెలివి తక్కువ సీఎం రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. డిప్యూటీ సర్వేయర్లుగా వీఆర్వోలను నియమించి ఆ ఉద్యోగాలను కూడా తామే ఇచ్చామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు.