Rakesh Reddy | హైదరాబాద్ : జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 46 బాధితులతో రేవంత్ చర్చలు జరపాలని రాకేశ్ రెడ్డి కోరారు. జీవో 46 బాధితుల పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్లిన రాకేశ్ రెడ్డిని పోలీసులు అనుమతించలేదు. సచివాలయం గేటు బయటనే వినతిపత్రంతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి పీఆర్ స్టంట్ మీద ఉన్న సోయి ప్రజా సమస్యలపై లేదు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, గురుకుల టీచర్లు ఆందోళనలు చేస్తుంటే పట్టింపు లేదు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 60 మార్కులు ఉన్నవారికి ఉద్యోగం వచ్చింది.. కానీ 90 మార్కులు వచ్చిన వారికి రాలేదు. జీవో 46 బాధితులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. బాధితుల పక్షాన సీఎస్‌ను కలిసేందుకు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. 10 రోజులుగా ఇదే వైఖరి.. ఈ ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటే. అందుకే వినతిపత్రం సచివాలయం గోడకు అంటించి నిరసన తెలిపాం. తాను చట్టసభల్లో లేకున్నా జనసభల్లో ఉంటా. బాధితుల పక్షాన నిలబడుతా. జీవో 46 బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారి పక్షాన పోరాటం చేస్తాం. రేవంత్ ప్రభుత్వం జీవో 46ను వెనక్కి తీసుకోవాలి లేదా సవరించాలి అని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.