హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేండ్ల పాలనలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు తప్ప, కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. లక్నో మెట్రోకు రూ.8,500 కోట్లు ఇచ్చిన కేంద్రం, హైదరాబాద్ మెట్రో విస్తరణకు పైసా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
గుజరాత్‌కు చెందిన మోదీ, అమిత్‌షా దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల కాంట్రాక్టులను వారి కంపెనీలకే కట్టబెడుతూ కార్పొరేట్ దోపిడీకి తెరలేపారని నిప్పులు చెరిగారు. రష్యా నుంచి క్రూడాయిల్ సరఫరా చేసుకుంటున్నామనే నెపంతో భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్ విధించిందని పేర్కొన్నారు. రష్యాపై అమెరికా, ఈయూ నిషేధం విధించడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో భారత్‌కు క్రూడ్‌లో భారీ డిస్కౌంట్ ఇస్తున్నదని తెలిపారు. దీనిని సాకుగా చూపి ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై కత్తిగట్టిందని ఆరోపించారు. ట్రంప్ టారిఫ్‌లతో దేశ ప్రజలపై రూ.5లక్షల కోట్ల భారం పడనున్నదని, ముఖ్యంగా టెక్స్టైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపనున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా నుంచి దిగుమతి అవుతున్న క్రూడాయిల్‌ను అధిక శాతం అంబానీ రిలయన్స్ కంపెనీ చౌకగా దిగుమతి చేసుకొని, యూరోపియన్ దేశాలకు ఎక్కువ ధరకు ఎగుమతి చేస్తున్నదని తెలిపారు. తద్వారా రూ.1.50 లక్షల కోట్లను దండుకున్నదని ఆరోపించారు. కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం మేకిన్ ఇండియా అంటూ ఊదరగొట్టడం తప్పా ఉద్ధరించింది ఏమీలేదని మండిపడ్డారు. బీజేపీ అసమర్థత పాలనతో డాలర్‌తో రూపాయి మారకపు విలువ పడిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.