కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు, కుట్రలు ఉన్నాయని ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ నిర్ణయం రైతుల పక్షాన కాకుండా ప్రభుత్వ పక్షాన ఉందని బీఆర్ఎస్ పార్టీ అనేకసార్లు చెప్పిందని పేర్కొన్నారు. అదే ఇప్పుడు ముమ్మాటికి నిజమైందని తెలిపారు. అర్హత ఉండి కూడా రుణమాఫీ వర్తించకుండా ఇబ్బంది పడుతున్న రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేకించి ఒక ఫోన్ నంబర్ ఇచ్చామని తెలిపారు. 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,562 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. మెసేజ్‌ల రూపంలో వాట్సాప్‌లో 42,984 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అంటే గంటకు 875 ఫిర్యాదులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఏ స్థాయిలో అమలవుతుందో చెప్పడానికి తెలంగాణ భవన్‌లోని ఫోన్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులే సాక్ష్యమని అన్నారు.
రుణమాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారని పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ గ్రామస్థాయిలో పరిశీలన చేస్తే రేషన్ కార్డుకు ఒక్కరికే రుణమాఫీ అయినట్లు రైతుల ఫిర్యాదుల ద్వారా వెల్లడవుతుందని విమర్శించారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డులో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని రైతు రుణమాఫీ కావడం లేదని ఫిర్యాదులు అందాయని తెలిపారు. కొందరికి వీసా ఉందని రైతు రుణమాఫీని తిరస్కరిస్తున్నారని చెప్పారు. కొన్ని తండాల్లో అయితే భూ రికార్డులు సరిగ్గా లేవని రుణమాఫీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఒత్తిడితో, దేవుళ్ల మీద ఒట్లు వేశానని సీఎం రేవంత్ రెడ్డి కేవలం తూతూ మంత్రంగా రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతు పంట ఆధారంగా అందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. రైతు భరోసా ఎగ్గొట్టారని.. పంటలకు బోనస్ బోగస్ చేశారని ఆరోపించారు. రైతు భరోసా, బోనస్ డబ్బులు మిగుల్చుకుని ఆ డబ్బులను రుణమాఫీకి కేటాయించారని విమర్శించారు. బ్యాంకర్లకు లేని నిబంధనలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రైతులకు రైతుబంధు రూపంలో రూ.72వేల కోట్లు, రైతు రుణమాఫీ రూపంలో మరో రూ.30వేల కోట్లు అందించారని గుర్తు చేశారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫిర్యాదు నంబర్లకు గంటకు దాదాపు 900 ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే రైతులు ఏవిధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే క్షేత్రస్థాయిలో రైతు సదస్సులు పెట్టి రుణమాఫీపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా సమీక్షకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం విహారయాత్రలకే పరిమితమైందని అన్నారు. రాష్ట్రంలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు. రుణమాఫీ కాని రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సివిల్ సప్లై కుంభకోణంపై త్వరలోనే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.