Peddi Sudarshan Reddy | హైదరాబాద్ : జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా టచ్ చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చుతామంటే 60 లక్షల మంది గులాబీ సైనికులు చేతులు ముడుచుకోని కూర్చోరు అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ కార్యాలయాలు కూలగొడుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయాలన్ని కూల్చండి అని చెప్పిండు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాలన్ని కూల్చేస్తామని.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వారి పార్టీకి కూడా భూ కేటాయింపులు జరిగాయి. ఆ జీవోనే అనుసరించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తుకు తెచ్చుకోవాలి. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ భవనాలు కూల్చుతామంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరు అని సుదర్శన్ రెడ్డి తేల్చిచెప్పారు.
గాంధీ భవన్‌ను ఏ విధంగా వాడుకుంటున్నారో, దాని లోసుగుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తది. ఇప్పటికి ఆనాటి లీజ్ అగ్రిమెంట్స్ వ్యాలిడా..? ఇన్వ్యాలిడా..? అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ కార్యాలకాలపాలకు వాడాల్సిన భవనాలను కాంగ్రెస్ పార్టీ కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలుగా మార్చి లక్షల రూపాయాలు వసూళ్లు చేస్తున్నారు. వీటన్నింటిని కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసుకోవాలి. మా పార్టీ కార్యాలయాన్ని టచ్ చేస్తే మీ కార్యాలయాలను కూడా టచ్ చేస్తమని, గులాబీ దళం చేతులు ముడుచుకోని కూర్చోదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.