హైదరాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా రైతులకు రైతుభరోసా ఎందుకు చెల్లించడంలేదని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనేది ఒకటి ఉన్నదనే విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసా? గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోతే జిల్లాను నిర్లక్ష్యం చేస్తారా? ఆ జిల్లా రైతులు పన్నులు కట్టడం లేదా? ఎందరో రైతుల త్యాగాల ఫలితమే రంగారెడ్డి జిల్లా అభివృద్ధి. హరియాణాలోని గుర్గావ్ జిల్లా తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. దేశానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే ఐదు జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా ఒకటి. ఎందుకని ఇక్కడి రైతులకు రైతుభరోసా ఇవ్వడం లేదు?’ అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాపై అంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారో అర్థం కావడంలేదని మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లా రైతులకు రైతుభరోసా చెల్ల్లించకుండా చొద్యం చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి.. ఆ జిల్లా ప్రజల ఓట్లు అవసరం లేదా? అని కార్తీక్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయం అనేది వారి హక్కు అని, వ్యవసాయం చేసే ప్రతీఎకరానికి, ప్రతీ రైతుకు రైతుభరోసా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నేతలకు ఎందుకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిస్తున్నారని నిలదీశారు. మంత్రివర్గంలో ఒక్కరు కూడా రంగారెడ్డి జిల్లాకు చెందినవారు ఎందుకు లేరని ప్రశ్నల వర్షం కురిపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి రైతులపట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కార్తీక్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ది కన్న తల్లి ప్రేమ అని, ఆయన రైతుల కోసం ఎన్నో ప్రయోజనాలు అందించడంతోపాటు రైతుబంధు వంటి అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. బిడ్డకు ఆకలి వేసినప్పుడు కన్నతల్లి నాలుగు గోడల మధ్య అన్నం పెడుతుందని.. సవతి తల్లి బజార్లో, నలుగురికి తెలిసేలా అన్నం పెడుతుందని ఎద్దేవా చేశారు. రైతులకు సాయం చేయడం ఒక బాధ్యతగా రేవంత్‌రెడ్డి భావించాలని హితవు పలికారు. రైతులకు సాయం చేశామంటూ కాంగ్రెస్ నేతలు బజారులో సంబురాలు జరుపుకొంటున్నారని, వాస్తవానికి గ్రామాల్లో ఏ ఒక్క రైతు కూడా సంబురాలు జరుపుకోవడంలేదని, వారెవ్వరూ సంతోషంగా లేరని తెలిపారు.
ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా రైతులకు వారంలో రైతుభరోసా డబ్బులు జమ చేయకపోతే అన్నదాతల పక్షాన రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని కార్తీక్‌రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా భూములు భూసేకరణకు కావాలే కానీ, రైతుభరోసా డబ్బు లు వేయడానికి పనికిరావా? అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా నేతలు రాము యాదవ్, వెంకటేశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.