Sangareddy | సంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గొప్ప మనసు చాటుకున్నారు. ఓ ఇద్దరు అనాథ ఆడపిల్లలకు అండగా నిలిచారు. ఆ పిల్లల చదువు అయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తానని మాణిక్యం హామీ ఇచ్చారు. ఆ ఇద్దరు పిల్లలకు తక్షణ సాయం కింద మాణిక్యం ఫౌండేషన్ తరపున రూ. 50 వేలు అందజేశారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన మొగులయ్య, అమృత దంపతులు కొన్నేండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆ దంపతుల ఇద్దరు పిల్లలు బేగ్రాయి మెర్సీ(12), బేగ్రాయి జోయ్సీ(15) అనాథలుగా మిగిలిఆరు. కొండాపూర్లోని తమ మేనమామల ఇంట్లో ఉంటూ ఆ ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఒకరు 7వ తరగతి కాగా, మరొకరు 10వ తరగతి.
ఈ సందర్భంగా పట్నం మాణిక్యం.. అనాథ పిల్లలతో సమావేశమయ్యారు. వారి ఉన్నత చదువుల నిమిత్తం నెల నెలకు ఆర్థిక సాయం అందిస్తానని మాణిక్యం హామీ ఇచ్చారు. ఆ ఇద్దరు అమ్మాయిలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరు జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటానని మాణిక్యం హామీ ఇచ్చారు.