కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని అన్ని మోటార్లను వెంటనే ఆన్ చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారికంగానే 34,800 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, తెలంగాణ మాత్రం ఒక్క మోటార్ ద్వారా కేవలం 800 క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 20 మండలాల్లో మొత్తం 447 చెరువులు ఉండగా,182 చెరువులు 50% కూడా నిండలేదని మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. 175 చెరువులు 25% మాత్రమే నిండాయని, 90 చెరువులు పూర్తిగా వట్టిపోయాయని అన్నారు. మొత్తం చెరువుల సామర్థ్యం 6.28 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 2.55 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయని తెలిపారు. వనపర్తి జిల్లాలో 222 చెరువులు ఉండగా, 54% చెరువులు ఇంకా నిండలేదని.. మొత్తం చెరువుల సామర్థ్యం 8.39 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.23 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయని తెలిపారు. ఇంకా పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు, చెరువులు నిండకముందే మోటార్లు ఎందుకు బంద్ చేశారని ఆయన ప్రశ్నించారు. వెంటనే మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. మోటార్లు వెంటనే ప్రారంభించకపోతే రైతులతో కలిసి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు