Manne Krishank | కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఆరు నెలల్లో ఆరు స్కాంలకు పాల్పడిందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. బియ్యం స్కాం, లిక్కర్ స్కాం, ఫ్లై యాష్ స్కాంలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని విమర్శించారు.
జనవరి 11న ఆర్టీసీ డిజిటల్ టిక్కెట్ల కోసం ఇచ్చిన టెండర్‌ను రద్దు చేసి.. ఆఫ్‌లైన్ టెండర్‌ను తీసుకువచ్చారని మన్నె క్రిశాంక్ అన్నారు. ఎన్ని సంస్థలు వచ్చాయి, ఎంత అమౌంట్‌కు కోట్ చేశారో చెప్పలేదని తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా ఛలో మొబిలిటీ అనే సంస్థకు టెండర్‌ను కట్టబెట్టారని విమర్శించారు. ఆర్టీసీ టిక్కెట్ కమీషన్ నేరుగా ఆ కంపెనీ ఖాతాలోకి వెళ్తుందని అన్నారు. కాంట్రాక్టు గురించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు గోప్యత పాటించారని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా 13,200 మిషిన్స్ కొనుగోలు చేశారు.. ప్రతి టిక్కెట్ కమీషన్ కంపెనీకి వెళ్తుందని క్రిశాంక్ ఆరోపించారు. ఈ కమీషన్లో పొన్నం ప్రభాకర్ వాటా ఎంత అని నిలదీశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల ప్రభుత్వంగా మారిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ ఓపెన్‌గా జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం అంటూ డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. రవాణా శాఖలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.