హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులను ఏదీ అడిగినా ‘మాకు తెలియదు.. సంబంధం లేదు’ అంటున్నరు.. ఇది ప్రజాపాలనా లేదా తుగ్లక్ పాలనా? అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు డమ్మీలుగా ఉన్నారా? అని నిలదీశారు. అధికారులు విషయాలను మంత్రులకు చెప్పడం లేదా? లేక తప్పించుకోవడానికి మంత్రులే సాకులు చెప్తున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో నకిలీబీర్లు తయారుచేసిన సోం డిస్ట్రీలరీస్కి అనుమతులు ఇచ్చిన విషయం తనకు తెలియదని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారని గుర్తుచేశారు.
కోట్ల విలువైన ఆర్టీసీ టికెటింగ్ కాంట్రాక్ట్‌కు ఒక కంపెనీకి కట్టబెట్టారన్న విష యం గురించి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అడితే సమాచారం లేదంటున్నారని మండిపడ్డారు. సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఇది తమ పరిధిలో లేదని ఆర్టీసీ ఎండీ కార్యాలయం ప్రత్యుత్తరం పంపిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను ఆయన మీడియాకు చూపించారు. ఈ పరిణామాలను చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం నడుస్తలేదు… ఫేక్ పాలన నడుస్తున్నట్టు కనిస్తున్నదని ఎద్దేవాచేశారు. సీఎం, మంత్రుల్లో నూ ఏ ఒక్కరికీ జవాబుదారీతనం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని క్రిశాంక్ మండిపడ్డారు. ఆర్టీసీ లోగో విషయం లో కొణతం దిలీప్‌పై, సోషల్ మీడియాలో పోస్టుల అంశంలో తనపై కూడా కేసులు నమో దు చేశారని గుర్తుచేశారు.