హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బజారు భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ (BRS party) సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudhanachary) అన్నారు. మంగళవారం తెలంగాణభవన్ (Telangana Bhavan) లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఫామ్‌హౌజ్‌లో మానవ మృగాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తీవ్రమైన విషయమన్నారు.
కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. అహింస పద్ధతుల్లో తెలంగాణ తెచ్చిన మరో గాంధీ కేసీఆర్ అని అన్నారు. మృగత్వానికి ప్రతిరూపాలు కాంగ్రెస్ పాలకులే అని చెప్పారు. ఎమర్జెన్సీ పెట్టి ప్రజలతో హాహాకారాలు చేయించిన ఇందిరాగాంధీ మృగత్వానికి ప్రతీక అన్నారు. నాడు ఢిల్లీలో టర్క్ మెన్ గేట్ దగ్గర వెలాది పేదల ఇండ్లు కూల్చిన మృగత్వం కాంగ్రెస్ పార్టీ సొంతమని విమర్శించారు.
1969 ఉద్యమంలో వందలాది మందిని పొట్టన పెట్టుకున్న మృగత్వం కాంగ్రెస్ పార్టీదేనని, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మృగత్వం ఆనవాళ్లను వంట పట్టించుకున్నారని మధుసూదనాచారి విమర్శించారు. హామీలను నెరవేర్చడం చేతగాకనే సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను సువర్ణ తెలంగాణగా మార్చిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. తెలంగాణలో ప్రధాన సమస్యలన్నింటిని కేసీఆర్ పరిష్కరించారని అన్నారు.
సీఎం రేవంత్‌కు అధికారంతో ఒళ్ళు కొవ్వెక్కిందని మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే బలుపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం మాటలకు విశ్వసనీయత లేదని అన్నారు. అది నోరా.. మోరా..?
అని మండిపడ్డారు. యూరియా ఇవ్వని అసమర్థుడు రేవంత్ రెడ్డి అని చెప్పారు. గతంలో ఏ కాంగ్రెస్ సీఎం ఇంత నీచమైన భాష మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి ఓయూను స్టాన్‌ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు చేస్తాననడం హాస్యాస్పదమన్నారు.
ప్రజలను క్షోభ పెడుతూ రేవంత్ మాయమాటలు చెబుతున్నారని మధుసూదనాచారి మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వంద సీట్లు గెలుస్తామంటున్నాడని, ముందుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలి సవాల్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ప్రగతి భవన్ కంచెలు తీశామని చెబుతూ ఓయూలో కంచెలు ఎందుకు ఏర్పాటు చేశావని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం పోస్టుకు గౌరవం పెంచేలా మాట్లాడాలని, పిచ్చి వాగుడు వాగితే ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.