హైదరాబాద్ సిటీబ్యూరో/మల్కాజిగిరి/నాచారం, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, అబద్ధాలు చె ప్పడం, ప్రభు త్వ భూములు అమ్మడం, ఆమ్యామ్యాలకు ఆస్కారం ఇవ్వడమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రైవేట్ వ్యక్తులకు భూములను ధారాదత్తం చేసేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందని, కాంగ్రెస్ విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని, దేశవ్యాప్తంగా వచ్చిన రైతు ఉద్యమం లాంటి ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటపట్టిన నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని రెండు కస్టర్లలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం నిరస న ప్రదర్శన చేపట్టింది. మధుసూదనాచారి బృందం మౌలాలి, ఐలా ప్రాంతంలో, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి బృందం నాచారం, మల్లాపూర్ పారిశ్రామికవాడల్లో పర్యటించింది.
‘తెలంగాణను దోచుకుంటున్న దండుపాళ్యం ముఠా’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హిల్ట్ పాలసీని రద్దు చేయాలని నినాదాలు చేశారు. మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం విఘాతం కలిగిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్ కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. జేబులు నింపుకోవడానికి, కాసుల కోసమే హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని, ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. హిల్ట్ పాలసీ చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని చెప్పారు. దాచుకోవడం, దోచుకోవడం కోసమే రేవం త్ ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తున్నదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కృషిచేశారని తెలిపారు. పరిశ్రమల స్థాపన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని, తెలంగాణను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దిందని వివరించారు.
హిల్ట్ పాలసీని రద్దుచేయాలి : జగదీశ్‌రెడ్డి
హిల్ట్ పాలసీని రద్దుచేయాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ధనార్జనే ధ్యేయంగా హైదరాబాద్ నగరంలో ఉన్న పారిశ్రామికవాడల్లోని కాలుష్య కారక పరిశ్రమల తరలింపు పేరుతో మొత్తం పరిశ్రమలను తొలగించి విలువైన భూములను రియల్ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తున్నారని విమర్శించారు. నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, ఉప్పల్, కుషాయిగూడ, పారిశ్రామిక ప్రాంతా ల్లో ఉన్న అన్ని పరిశ్రమలను తొలగించడం వల్ల అక్కడ పనిచేస్తున్న కొన్ని వేల మంది కార్మికులు, ఉద్యోగులకు పని దొరుకకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని పరిశ్రమలను తరలించడం వల్ల నిరుద్యోగ సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమలను తరలించాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

కాలుష్య రహిత పరిశ్రమలను తరలించకుండా చూ డాలని సూచించారు. హిల్ట్ పాలసీ ద్వారా పరిశ్రమలను తరలించి ఆ భూములను తక్కువ ధరలకు రియల్ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేసి రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీని విరమించుకోవాలని లేదంటే పెద్దఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్యగౌడ్, భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రబాకర్‌రెడ్డి, బొల్ల మల్లయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేమూరి ధర్మేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు శాంతిసాయి జెన్ శేఖర్, పన్నాల దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు క్షేత్ర పరిశీలనకు కేటీఆర్, హరీశ్
హిల్ట్ పాలసీతో పరిశ్రమల భూములను రియల్ఎస్టేట్ దందాకు మళ్లించాలని చూస్తున్న కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ గురువారం కూడా పలు పారిశ్రామిక వాడల్లో పర్యటించనున్నది. క్లస్టర్-4లోని జీడిమెట్ల, కూకట్పల్లి ప్రాంతాల్లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. క్లస్టర్-1లోని పాశమైలారం పాశమైలారం, పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బృందం పర్యటించనున్నది. క్లస్టర్-5లో మాజీ మంత్రి తలసాని నేతృత్వంలోని బృందం, క్లస్టర్-6లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ టీమ్ ఇండస్ట్రియల్ పారులను సందర్శిస్తాయి. క్లస్టర్-7లో మాజీ మంత్రి సబిత, క్లస్టర్-8లో మాజీ మంత్రి మహమూద్‌అలీ నాయకత్వంలోని బీఆర్ఎస్ బృందాలు వాస్తవాలు తెలుసుకోనున్నాయి.