మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్‌రావుకు సిట్ నోటీసులపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. కక్ష సాధింపులో భాగంగానే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద మధుసూదనాచారి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయాడని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే స్కీమ్‌ల ప్రభుత్వం.. కాంగ్రెస్ అంటే స్కామ్‌ల ప్రభుత్వమని సెటైర్ వేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ చీల్చిచెండాడుతుందని తెలిపారు. అందుకే కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మధుసూదనచారి మండిపడ్డారు. వాళ్ల కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట సమయంలో అనేక మందిని జైల్లో పెట్టిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నాడని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి అని అన్నారు. తెలంగాణ కోసం హరీశ్‌రావు ప్రాణ త్యాగానికి పాల్పడిన వ్యక్తి అని తెలిపారు. రేవంత్ రెడ్డి నిర్వాకం నిలదీసే రోజు ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ కుట్రలతోనే జరుగుతున్నాయని.. ఇలాంటి కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
హరీశ్‌రావుకు నోటీసులిస్తే.. తెలంగాణ సమాజం అంతా కదిలివచ్చిందని మధుసూదనాచారి అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి అవినీతిపై హరీశ్‌రావు ప్రశ్నిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.