హైదరాబాద్, జూలై 26 (నమస్తేతెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ భరోసా ఇచ్చారు. 2026 జనగణన తర్వాత అన్ని రాష్ట్రాల మాదిరిగానే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. గత శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కొందరిలో అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కేసు కోర్టులో కొట్టుకుపోవడానికి ఏపీ విభజన చట్టం రూపకల్పనలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలే కారణమని ఆరోపించారు. తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గట్టు రామచందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
నియోజకవర్గాల పెంపునకు సంబంధించి విభజన చట్టంలోని సెక్షన్ 26లో స్పష్టత ఇవ్వకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)కి లోబడి ఉంటుందని చెప్పడంతోనే సమస్య ఎదురైందని తెలిపారు. గతంలో ఈ విషయంపై 170(3)కి సంబంధం లేకుండా చట్టంలో సవరణ చేయాలని అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తాను ప్రధాని మోదీకి చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందని అన్నారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్-26లో పొందుపరిచిన విధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.
ఈ కేసులో గతంలో జమ్ముకశ్మీర్ విభజన జరిగి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీ సీట్లు పెంచిన విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత జమ్ముకశ్మీర్‌లా సీట్ల పెంపు సాధ్యంకాదని తిరస్కరిస్తూ తీర్పు చెప్పిందని వివరించారు. అక్కడ ఆర్టికల్ 170(3)తో సంబంధం లేకపోవడంతో సీట్లు పెంచారని, కానీ కాంగ్రెస్ తప్పిదం కారణంగా తెలుగురాష్ట్రాల్లో 170(3)తో ముడిపెట్టడంతో సీట్ల పెంపు సాధ్యంకాలేదని చెప్పారు. కేంద్రం 2026లో చేపట్టనున్న జనగణన తర్వాత అంటే మార్చి 1, 2027 తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని, అదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం అనివార్యమని ఉద్ఘాటించారు. చట్టం-5 ప్రకారం జనగణన జరిగిన వెంటనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కూడా తప్పనిసరిగా అమల్లోకి వస్తాయని వెల్లడించారు.