మహబూబాబాద్ : పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌లా కొట్లాడిండ్రని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు. పెద్ద నేతలమని చెప్పుకునే కడియం శ్రీహరి లాంటివాళ్లు పార్టీ మారినా.. కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం శ్రమించారని అన్నారు. మహబూబాబాద్‌లో జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మహబూబాబాద్‌లో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు.
‘బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు, మహబూబాబాద్‌కు ఎంత మేలు జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఒకటిగాదు, రెండుగాదు ఏకంగా 3,400 తండాలను గ్రామపంచాయితీలు చేసిన నాయకుడు ఎవరు..? కేసీఆర్. గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచింది ఎవరు..? కేసీఆర్. తండాలను గ్రామపంచాయితీలు చేయడం మాత్రమే గాదు, ఇయ్యాల ప్రతి తండాలో ఒక నీళ్ల ట్యాంకర్ ఉన్నది, ఒక ట్రాక్టర్ ఉన్నది, ఒక డంపింగ్ యార్డు ఉన్నది, ఒక వైకుంఠదామం ఉన్నది, ఒక నర్సరీ ఉన్నది, ప్రతి ఇంటి ముంగిట ఒక నల్లా ఉన్నది. ఇవన్నీ చేసింది ఎవరు..? కేసీఆర్’ అని కేటీఆర్ చెప్పారు.
‘ఒకప్పుడు ఏ పల్లెకుపోయినా నీళ్ల కోసం తిప్పలు ఉండె. తాగునీళ్ల కోసం మహిళలు కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుండే. మాకు నీళ్లు కావాలె అని నేతలకు బిందెలు అడ్డం బెట్టి గడబిడ జేస్తుంటే. ఇయ్యాళ్ల ఆ పరిస్థితి ఉందా తెలంగాణలో. లేదు. దేశంలోనే బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నయంటే తెలంగాణలోనే. మరి వాటిని తయారు చేసింది ఎవరంటే కేసీఆరే. బీఆర్ఎస్ హయాంలో దయన్న (ఎర్రబెల్లి దయాకర్) పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసినం. మా ఇద్దరి మధ్య పోటీ ఉంటుండె. దయన్న ఎప్పుడూ ‘హే.. మీ శాఖ కంటే మా శాఖకే ఎక్కువ జాతీయ అవార్డులు వచ్చినయ్’ అంటుండే. అది వాస్తవమే. దేశ జానాభాలో కేవలం 3 శాతం మాత్రమే ఉన్న తెలంగాణకు జాతీయ అవార్డులు ఎక్కువగా వస్తుండె’ అని ఆయన గుర్తుచేశారు.
‘దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లెలను తీర్చిదిద్దుకున్నం. నాడు నాయకులు ఇంత అభివృద్ధి చేయడానికి బలం ఇచ్చింది పార్టీ కార్యకర్తలే. పెద్దోళ్లమని చెప్పుకునే నాయకులు పార్టీలు మారినా, కార్యకర్తలు పార్టీలు మారలే. ఈ జిల్లాలో కడియం శ్రీహరి లాంటోళ్లు పార్టీ మారినా కార్యకర్తలు పార్టీ కోసం పని చేసిండ్రు. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌లా అద్భుతంగా కొట్లాడిండ్రు. లగచర్ల గురించి మహబూబాబాద్‌లో 30 వేల మందితో బీఆర్ఎస్ మీటింగ్ పెడితే.. ఆ దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లగచర్ల నోటిఫికేషన్ రద్దుచేసి, జైల్లో పెట్టిన గిరిజన బిడ్డలను విడిచిపెట్టింది. ఇయ్యాల కూడా నాకు మహబూబాబాద్‌కు వస్తుంటే గుండెలనిండా సంతోషం అనిపించింది’ అని కేటీఆర్ అన్నారు.