హైదరాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ) : భారతీయ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడొద్దు.. పారిశ్రామికవేత్తలు, అంత్రప్రెన్యూర్లుగా మారి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఉద్బోధించారు. కొలంబియా యూనివర్సిటీలో ఫైర్ సైడ్ చాట్‌లో నిరుద్యోగం, స్టార్టప్‌ల స్థాపన, యువత, గెలుపోటములపై తన అభిప్రాయాలు పంచుకొన్నారు. కొలంబియా బిజినెస్ స్కూల్ 21వ వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం ప్రత్యేక చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పారిశ్రామిక రంగాలు, భారతదేశ ప్రగతిని క్లుప్తంగా వివరించారు. భారత ఆర్థిక గమనం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వ్యవస్థాపకత, లైఫ్ సైన్సెస్, మారుతున్న ఉద్యోగాల శైలి, నాయకత్వ లక్షణాలు ఇతరత్రా అంశాలపై లోతైన విశ్లేషణలను విద్యార్థులతో పంచుకున్నారు.
దశాబ్దంలోనే అద్భుత ప్రగతి
గడిచిన దశాబ్దకాలంలోనే భారతదేశం భౌతిక, సాంకేతిక, మౌలిక సదుపాయాల రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 3జీ, 4జీ, 5జీ లాంటి టెలికాం సాంకేతికతలను భారత్ ప్రపంచ దేశాల కంటే ముందే అందిపుచ్చుకున్నదని గుర్తుచేశారు. ప్రస్తుతం భారత్ ఒక కీలక దశలో ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని ఇతర దేశాల అభివృద్ధి నమూనాలను, వారి విధానాలను ఉన్నది ఉన్నట్టుగా కాపీ కొట్టే పరిస్థితి లేదని నొక్కిచెప్పారు. ఇలాంటి తరుణంలో మనం సొంతంగా, వినూత్నంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు.
పొంచి ఉన్న ఏఐ ముప్పు
ప్రపంచవ్యాప్తంగా ఏఐ పెనుమార్పులు తీసుకురాబోతున్నదని, సమీప భవిష్యత్‌లో మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. కొలువులకు ముప్పు వాటిల్లే అవకాశమున్నదని విశ్లేషించారు. తాజాగా ప్రతిష్ఠాత్మక ఒరాకిల్ సంస్థ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఏఐ మార్పులను తట్టుకొనేందుకు ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ ఇప్పటికీ సిద్ధంకాలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ విప్లవాన్ని తట్టుకోవాలంటే కాలానుగుణంగా యువత నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని హితబోధ చేశారు.
హైదరాబాద్ తరహాలో ఇన్నోవేషన్ హబ్‌లు కావాలి
అంకుర సంస్థల ఏర్పాటుపై హైదరాబాద్‌ను ఒక ఉదాహరణగా చూపారు. ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇంక్యుబేటర్లు, కో వర్కిం గ్ స్పేస్‌లు, మెంటా ర్ల ప్రోత్సాహంతోనే హైదరాబాద్ నుంచి అనేక యునికార్న్ సంస్థలు ఆవిర్భవించాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ పెరుగాలంటే కేవలం పథకాలు సరిపోవని అభిప్రాయపడ్డారు. పటిష్టమైన ఎకో సిస్టమ్ అవసరమన్నారు.చిన్న చిన్న విజయాలకే సంతృప్తి చెందొద్దు
భారతదేశంలో ఉన్న యువ జనాభా ఒక శక్తి అని, అయితే అదే సమయంలో అది ఒక సవాల్ అని కేటీఆర్ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవకాశాలు కల్పిస్తే సరిపోదని, సరైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారుచేయాలని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలు, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి అనేక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ విధానం) ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని స్పష్టంచేశారు. యువత పెద్ద పెద్ద కలలు కనాలని, వాటి సాధనకు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న విజయాలతో సంతృప్తి చెందవద్దని ఉద్బోధించారు. జీవితంలో ఓటమికి భయపడాల్సిన అవసరం లేదని, వైఫల్యం అనేది గెలుపు దిశగా సాగే ప్రయాణంలో ఒక భాగం మాత్రమేనని చెప్పారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధైర్యం, చొరవతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు, ప్రవాస భారతీయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్ వివిధ అంశాలపై చెప్పిన మాటలకు చప్పట్లతో సానుకూలంగా స్పందించారు.