నాంపల్లి కోర్టులు, మే 6 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించిన నకిలీ సర్క్యులర్ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఒక్కరోజు కస్టడీ ముగియడంతో సోమవారం నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట పోలీసులు హాజరుపర్చారు. ఈ నెల 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను కొనసాగిస్తూ ఇన్చార్జి కోర్టు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడి తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌కు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో సాక్షాధారాలు, సాక్షులను తారుమారు చేసే అవకాశమున్నదని, బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. వాదనల కోసం కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై రెండో నిందితుడికి వెసులుబాటు లభించింది. రిమాండ్ రిపోర్టులో రెండో నిందితుడిగా చేర్చిన బీఆర్ఎస్ నేత నాగేందర్‌కు 41-ఏ నోటీసులు జారీ చేయాలని, అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.
4వ సెషన్ కోర్టు జడ్జి అందుబాటులో లేకపోవడంతో కేసును 6వ సెషన్ కోర్టు జడ్జికి బదిలీ చేశారు. ఆయనకు అనారోగ్యంగా ఉండటంతో ఈ కేసును 3వ సెషన్ కోర్టు జడ్జికి బదిలీ చేశారు. 3వ సెషన్ కోర్టు జడ్జి సెలవుపై వెళ్తుండటంతో ఈ కేసును 7వ సెషన్ కోర్టుకు బదిలీ చేశారు. మంగళవారం దీనిపై విచారణ జరుగనున్నది.