HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన పోలీసు అణచివేతను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తీవ్రంగా ఖండించారు.పండుగ రోజున విద్యార్థులపై పోలీసులను ఉసిగొల్పడం, యూనివర్సిటీలో వందలాది పోలీసులను మోహరించి నిరసన తెలియజేసిన విద్యార్థినుల్ని లాఠీలతో కొట్టడం, జుట్టుపట్టుకుని పోలీసులు స్టేషన్కి ఈడ్చుకెళ్లడం.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు.
కేంద్ర విద్యాసంస్థలకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడమేంటని కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును, రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పటాపంచలు చేస్తోందని మండిపడ్డారు. విద్యాసంస్థల భూముల అమ్మకాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నారా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే హింసించడమేనా మీ ప్రజాస్వామ్యం అని అడిగారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(A) ప్రకారం జీవవైవిధ్యాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 400 ఎకరాల భూమిలో ఉన్న వన్యప్రాణులను నాశనం చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూమిని అప్పగించాలనుకోవడం ఎంతవరకు న్యాయమేని ప్రశ్నించారు. భూముల వేలాన్ని నిలిపివేయడానికి పర్యావరణ, అటవీ శాఖలు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
#HCU విద్యార్థులపై రేవంత్ సర్కార్ కర్కశత్వం.
లాఠీలతో గొడ్డును బాదినట్టు బాదుతూ కాళ్లు, చేతులు బంధిస్తూ.. మహిళలు అఐ కూడా చూడకుండా జుట్టుపట్టి జంతువుల్లా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఠాణాలకు తరలింపు
బట్టలు చిరిగిపోతున్నాయని ఆడపిల్లలు రోదిస్తున్నా పట్టించుకోకుండా గుంజుకెళ్లిన వైనం..… https://t.co/0NzNZ3Aj4M pic.twitter.com/BPyPH22kkF
— BRS News (@BRSParty_News) March 31, 2025
యూనివర్సిటీ భూములను రక్షించేందుకు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలకతీతంగా మద్దతు పలకాలని ఆయన కోరారు. తెలంగాణలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు యూనివర్సిటీ భూముల వ్యవహారంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర విశ్వవిద్యాలయ భూముల పరిరక్షణపై వాళ్ల వైఖరి ఏమిటనేది తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పునరాలోచించి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, ప్రజా వ్యతిరేక నిరసనలకు అవకాశం ఇచ్చిన వారవుతారని హెచ్చరించారు.