చేవెళ్ల టౌన్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఆలూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, నలుగురు మృతి చెందిన ఘటనపై స్థానిక అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. చేవెళ్ల-బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అఖిలపక్ష నేతలు చేవెళ్ల నుంచి ఆలూర్ గేట్ వరకు పాదయాత్రగా వెళ్లి ధర్నాకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డంకులు అధిగమించి రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల-బీజాపూర్ రోడ్డుపై రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారని, ఇప్పటికే వందల మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తంచేశారు.
ధర్నాలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు. అటు ధర్నా వద్దకు వచ్చిన ఆర్డీవో చంద్రకళ ఆందోళనకారులతో చర్చించారు. రోడ్డు విస్తరణలో మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు ఉన్న 900 మర్రిచెట్లు తొలగించాల్సి వస్తుందని, పర్యావరణానికి హాని కలుగుతుందని తేజ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు కౌంటర్ దాఖలు చేయగా ఎన్జీటీ రోడ్డు విస్తరణకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కానీ తేజ అనే వ్యక్తి మళ్లీ స్టే తీసుకొచ్చారని వివరించారు. అందుకే రోడ్డు పనుల్లో జాప్యం జరుగుతున్నదని తెలిపారు. ఈనెల 16న ఎన్జీటీ తుదితీర్పు వెలువరిస్తుందని చెప్పగా, అఖిలపక్ష నేతలు ధర్నా విరమించారు. ఆందోళనలో బీఆర్ఎస్ నేతలు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, శుభప్రద్‌పటేల్, బీజేపీ నేత కేఎస్ రత్నం, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు.
కోర్టులు ప్రజల కోసం ఉండాలి. మనుషుల ప్రాణాల కంటే చెట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. బీజాపూర్ రహదారిపై రోజుకు ఇద్దరు ముగ్గురు చొప్పున చనిపోతున్నారు. డిసెంబర్ 16న ఎన్జీటీ రోడ్డు పనులకు అనుమతి ఇస్తే సంతోషం. లేకపోతే స్థానిక గ్రామాల ప్రజలే చెట్లను నరికివేస్తారు. అధికారులు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రమాదకరమైన ప్రదేశాల్లో పోలీసులు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
– కార్తీక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు
బీజాపూర్-హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనులను తక్షణమే ప్రారంభించాలి. నిరుడు ఎన్జీటీ సానుకూల ఆదేశాలు ఇచ్చినప్పుడే ప్రభుత్వం పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహించింది. రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగకపోవడంతో ప్రమాదాలు జరిగి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
– శుభప్రద్‌పటేల్, బీఆర్ఎస్ నాయకుడు