హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణ ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.2500 కోట్లను ఏపీకి కేంద్రం బదలాయించిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ర్టాలకు వచ్చే నిధుల అంశంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందో? లేదో?నని, ఏపీకి నిధులు పోవడం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.
పదేండ్లు కేసీఆర్‌పై ఏపీ ఒత్తిడి తెచ్చినా వారికి నిధులివ్వలేదని, చంద్రబాబుతో రేవంత్‌రెడ్డికి ఉన్న సంబంధాలతోనే ఈ నిధులు ఏపీకి వెళ్లాయని తెలిపారు. రాజకీయ పార్టీలు స్పందించకముందే తెలంగాణ మీడియా స్పందించాల్సి ఉన్నా ఇంతవరకు స్పందించలేదని, రాష్ర్టానికి అన్యాయం జరిగితే మీడియా సంస్థలు కూడా ప్రశ్నించాలని సూచించారు.
గతంలో తెలంగాణ నుంచి పొరపాటున ఏపీకి బదిలీ అయిన రూ.450 కోట్లను తిరిగి తెలంగాణకు రప్పించే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలయిక కేవలం కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకేనని, రాష్ర్టానికి నిధులు తేవడంలో బీజేపీతో కాంగ్రెస్‌కు దోస్తీ ఉండదని ఎద్దేవాచేశారు.
కేసీఆర్‌పై కోపాన్ని బీజేపీ నేతలు తెలంగాణపై చూపిస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీ బీ టీంగా పనిచేస్తున్నదని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు పైగా ఇచ్చి, తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలు కేవలం గ్లాడియేటర్ మూవీ లాంటి స్రిప్ట్ మాత్రమేనని దుయ్యబట్టారు.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే హైడ్రాను ముందట వేసుకున్నారని, దానితో రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదని, ఓఆర్ఆర్ లోపలి పరిధి చెరువుల్లో కొన్నేండ్లుగా ఇండ్లు కట్టుకున్నవారు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేస్తున్నదని, వీటిలో అనేకం బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, వారంతా ఎల్ఆర్ఎస్ కడుతున్నారని, ఆ ఇండ్లను కూడా కూలుస్తారా? అని నిలదీశారు.