హైదరాబాద్/యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. నెలన్నరగా మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం 11.47గంటలకు తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో గత నెలన్నరగా సికింద్రాబాద్‌లోని యశోదా దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారు. జిట్టా మరణవార్తతో భువనగిరి శోకసంద్రంలో ముగినిపోయింది. జిట్టా పార్థివదేహాన్ని భువనగిరిలోని ఆయన ఫామ్‌హౌస్‌కు తరలించారు.
తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నేత, జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణారెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. వారి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జిట్టా 1972 డిసెంబర్ 14న జిట్టా బాల్‌రెడ్డి (రిటైర్డ్ టీచర్), రాధమ్మ దంపతులకు జన్మించారు. సొంతూరు భువనగిరి పట్టణ పరిధిలోని బొమ్మాయిపల్లి. ఆయనకు భార్య సునీత, కుమారుడు వివేకానందరెడ్డి, కూతురు ఝాన్సీ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువజన సంఘాలను ఏకం చేయడంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో మంచి పేరు తెచ్చుకున్న జిట్టాకు రాజకీయంగా కలిసిరాలేదు. భువనగిరి ఎమ్మెల్యేగా పలు దఫాలుగా పోటీ చేసినా అదృష్టం కలిసిరాలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు. వివిధ పరిణామాల నేపథ్యంలో సొంతంగా యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అటు నుంచి కాంగ్రెస్, తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఆయన తల్లి రాధమ్మ పేరున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.106 గ్రామాల్లో వాటర్ ఫిల్టరు ఏర్పాటుచేయించారు. తెలంగాణ జాతర, ధూంధాం కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. భువనగిరిలో జూనియర్ కాలేజీ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేశారు.
ప్రజానేతకు భువనగిరి జనం అశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి జిట్టా పాడెను మోశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు డిమాండ్ చేశారు. పార్థివ దేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు.
జిట్టా మృతిపై మాజీ మంత్రి టీ హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను కలచివేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక పోరాటాల్లో కలిసి పనిచేశామని, భువనగిరి ప్రాంత ప్రజల కోసం జిట్టా ఎంతో తపనపడ్డారని గుర్తుచేశారు.
జిట్టా మృతిపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జిట్టా పార్థివ దేహానికి నివాళుర్పించారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, క్యామ మల్లేశ్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, చెరుకు సుధాకర్ నివాళి అర్పించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): జిట్టా బాలకృష్ణారెడ్డి మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జిట్టా బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. జిట్టా కోలుకుంటారని భావించానని కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి మొదటి నుంచి కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తుల్లో జిట్టా ఒకరని గుర్తు చేసుకున్నారు.