ఖలీల్‌వాడి, మే 1 : రేవంత్‌రెడ్డి ఔట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ ప్రొడక్ట్ కాదని, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని పేర్కొన్నారు. రేవంత్‌ది ఒరిజినల్ కాంగ్రెస్ బ్రాండ్ కాదని, అసలు అడ్రస్ ఆర్ఎస్ఎస్ అని, కరప్షన్ కోసమే కాంగ్రెస్‌లోకి మారినట్టు విమర్శించారు. గురువారం ఆయన నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ పరివారమంతా బీజేపీ అని, ఆయన వ్యవహారమంతా టీడీపీ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి చంద్రబాబు మెంటార్ అని, మోదీ ట్రైనింగ్ సెంటర్ అని పేర్కొన్నారు.
వరంగల్ బీఆర్ఎస్ సభను చూసి రేవంత్‌రెడ్డి మైండ్ బ్లాంక్ అయ్యిందని జీవన్‌రెడ్డి అన్నారు. రజతోత్సవ సభకొచ్చిన జనాన్ని చూసి కంగుతిన్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ విలన్ అన్నందుకే కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నాడని, మరి సోనియాగాంధీని బలిదేవత అన్నప్పుడు సిగ్గు లేదా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. సభలో కేసీఆర్ తన పేరు ఉచ్చరించలేదని రేవంత్ అక్కసు పెంచుకున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలే రేవంత్ పేరు ఉచ్ఛరించడంలేదని చెప్పారు. ఎక్కడైనా ఆయన పేరెత్తితే జనమే కొట్టేటట్టున్నారని తెలిపారు. సభలో పేరెత్తలేదని ఇప్పుడు కేసీఆర్ మీద విషం కక్కుతున్నాడని మండిపడ్డారు. రేవంత్‌కు రాజకీయ సమాధి కట్టడానికి కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడు ఎవరు ఎవరికి సమాధి కడతారో తెలుస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపడమేనని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో అసలు ఏ పథకం అమలవుతుందో చెప్పాలని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నిలదీస్తూ, వాటికి సంబంధించి రూపొందించిన జాబితాను మీడియాతో ముందు ప్రదర్శించారు. కేసీఆర్ కిట్, ఓవర్సీస్ స్కాలర్షిప్, 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, చేప పిల్లలు, గొర్రె పిల్లల పంపిణీ, బతుకమ్మ చీరలు తదితర వాటిని ఇచ్చారా? అని నిలదీశారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆంధ్రా నేతలకు భజన చేయడంలో ఆరితేరిండని విమర్శించారు.