హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడుతుంటే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము కూడా ఎదురు తిరిగి తన్నడం మొదలుపెడితే లెక్క మరోలా ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ఓపిక పడుతున్నామని స్పష్టంచేశారు.
రాష్ట్రంలోని ఇటీవలి పరిణామాలు, కాంగ్రెస్ గూండాలపై చర్యలకు పట్టుబడుతూ గురువారం డీజీపీ జితేందర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జగదీశ్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడానికి ప్రధాన కారణం సీఎం, ఆయన వాడుతున్న భాష, ప్రవర్తనేనని తెలిపారు.
కౌశిక్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే గాంధీపై సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ వ్యక్తిగా, సీఎంగా గాంధీపై చర్యలు తీసుకునే స్థాయి రేవంత్‌కు ఇంకా రాలేదని ఎద్దేవా చేశారు. సీఎం పదవికి ఉన్న గౌరవం, దానికి ఉన్న విలువ కూడా రేవంత్‌కు తెలియదని విమర్శించారు. తాను మాట్లాడే వేదిక ఏమిటో కూడా సీఎం మర్చిపోయి.. బడిపిల్లల దగ్గర కూడా కేసీఆర్, కేటీఆర్‌పై బూతులు తిడుతూ, పీసీసీ అధ్యక్షుడి కార్యక్రమానికి వెళ్లి ‘చింతపండు చేసినం’ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దాడుల్లో పోలీసుల పాత్ర
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల్లో పోలీసుల పాత్ర కూడా ఉన్నదని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే 4 సంఘటనలు జరిగాయని తెలిపారు. పోలీసుల ఎదుటే కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తున్నా చోద్యం చూస్తున్నారని వెల్లడించారు. ఇదే విషయంపై గతంలోనూ కేటీఆర్ ఆధ్వర్యంలో డీజీపీకి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. తిరుమలగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతుల దీక్షపై కాంగ్రెస్ గూండాలు దాడిచేస్తుంటే, వారికి పోలీసులు సహకరించారని చెప్పారు. ఆ వీడియోలు, ఫొటోలతో సహా డీజీపీకి అప్పగించామని వివరించారు.
ఖమ్మంలో నలుగురు మాజీమంత్రులు, పది మంది ఎమ్మెల్యేలు వరద బాధితులను పరామర్శిస్తూ.. సహాయ కార్యక్రమాలు చేపడితే కాంగ్రెస్ గూండాలు రాళ్లదాడి చేసి, ఓ కార్యకర్తను కారు కిందకు నెట్టేసి చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీమంత్రి హరీశ్‌రావు కారుపై దాడి చేయడం, హత్యాప్రయత్నం చేయటంపైనా ఫిర్యాదు చేశామని తెలిపారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి చేస్తుంటే.. ఏసీపీ అక్కడే ఉన్నా కాంగ్రెస్ గూండాలపై ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 ట్రాఫిక్ సిగ్నల్స్ క్లియరెన్స్ ఎలా ఇస్తారు?
బీఆర్ఎస్కు న్యాయంగా దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీకి ఇవ్వటంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రాజకీయంగా సవాల్ చేశారని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. గాంధీ బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని కౌశిక్‌రెడ్డి సవాల్ చేస్తే.. పోలీసులు పొద్దున్నే హౌజ్అరెస్టు చేశారని చెప్పారు. పోలీసులకు గౌరవం ఇచ్చిన కౌశిక్‌రెడ్డి అక్కడే ఉండిపోతే.. ‘10 గంటలకల్లా రాకపోతే నేను నీ ఇంటికి వస్తాను’ అని 20 కిలోమీటర్ల దూరం నుంచి బయల్దేరి ఎమ్మెల్యే గాంధీని అడ్డుకోవాల్సిన ఏసీపీ, సీఐ, ఎస్సైలు 12 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్‌కు క్లియరెన్స్ ఇచ్చారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఇంటిమీదకు తీసుకొచ్చి దగ్గరుండి దాడి చేయించారని, వారిపైనా కేసులు పెట్టాలని డీజీపీని కోరినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ నేతల బర్త్‌డేలను ఏకంగా ఎస్సైలు, సీఐలు పోలీసు స్టేషన్లలోనే జరపడం దారుణమని అన్నారు.
లాఠీ దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం మాది
పోలీసుల దెబ్బలు తమకు కొత్తేం కాదని, ఉద్యమాలు చేసిన అనుభవం తమది అని జగదీశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. ‘పోలీసు లాఠీలు ఎదుర్కొన్న అనుభవం మాది. సీఎంగా ఆయన (రేవంత్) నోరు కాపాడుకోవాలె. నోరు మంచిదైతే.. ఊరు మంచిదైతది. నాలుక మంచిగ పెట్టుకోకపోతే.. మీరన్న మాటలు మీకే వర్తిస్తాయి’ అని కాంగ్రెస్‌ను జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. కార్యకర్తలు ఏదైనా తప్పులు చేస్తే సరిచేయాల్సిన బాధ్యత నాయకులకు ఉన్నదని, కానీ ఏకంగా సీఎం వారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని డీజీపీకి చెప్పామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గుడులు, మసీదులు, చర్చీలు, పార్టీల ఆఫీసులు ప్రజలకు సంబంధించినవిగానే వాటి నిర్మాణానికి అనుమతులు తీసుకోవడం లేదు. నల్లగొండలో పార్టీ ఆఫీసులపై మాట్లాడుతూ అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.