సూర్యాపేట, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సేనని, ఒక్కో మండలంలో ఒక్క గ్రామాన్నే తీసుకొని పథకాలు అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉన్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు దరఖాస్తులు తీసుకొని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక అనడం హాస్యాస్పదంగా ఉన్నదని దుయ్యబట్టారు. గ్రామ సభలను ప్రహసనంగా మార్చారని, రెండు సార్లు దరఖాస్తులు తీసుకొని బుట్టదాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతున్నదని, గ్రామ సభలన్నీ ప్రజల నిరసనలతో మార్మోగాయని గుర్తుచేశారు. మండలానికి ఒక్క గ్రామం, మార్చి 31 అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇంకా మభ్య పెడుతున్నదని ఫైర్ అయ్యారు. డిసెంబర్ 9 అని చెప్పి ఇప్పుడు సంవత్సరానికి ఒక గ్రామంతో మొదలు పెట్టారని, రాష్ట్ర మంతా పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చెప్పాలని నిలదీశారు.
హామీల అమలులో విఫలమయ్యారని, గత సీఎం కేసీఆర్ ఇచ్చిన కరెంటు, నీళ్లును కూడా ఇవ్వలేక గప్పాలు కొడుతున్నారని విమర్శించారు. ఇందిరమ్మ బొమ్మ పెడితే పథకాలకు పైసలివ్వమనేది కేవలం హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు. ఓ పార్టీ రాష్ర్టానికి టోకరా ఇస్తే, మరో పార్టీ దేశానికి టోకరా ఇస్తున్నదని దెప్పిపొడిచారు. ఆ రెండు పార్టీలూ తెలంగాణ ద్రోహ పార్టీలేనని, వాటి నైజం ప్రజలకు అర్థమై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. గ్రామ సభల ద్వారా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నదని, కాంగ్రెస్, బీజేపీలకు రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం నాటి చుక్కలే చూపిస్తారని హెచ్చరించారు. ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. ఇచ్చిన హామీలను డిసెంబర్ 9 సోనియా జన్మదినం సందర్భంగా అమలు చేస్తామని చెప్పి రెండు బర్త్‌డేలు పోయాక ఇప్పుడు ఒక్క గ్రామం అంటున్నారని ఎద్దేవా చేశారు. మార్చి 31 తర్వాతైనా పూర్తి స్థాయి పథకాల అమలు అనుమానమేనని చెప్పారు. దోచుకోవడం కప్పం కట్టడంతోనే రేవంత్‌రెడ్డికి సమయం సరిపోవడం లేదని, ఇక పాలన ఏం చేస్తారని దెప్పిపొడిచారు.