Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 25 ( నమస్తే తెలంగాణ) : ఢిల్లీ కాంగ్రెస్‌ను సాదేందుకే ఎల్ఆర్ఎస్ ముసుగులో ప్రజలను బాదేందుకు గల్లీ కాంగ్రెస్ సిద్ధమైందని, ఎన్నికల్లో ఓట్లకోసం ఫ్రీగా చేస్తామని చెప్పి ఇప్పుడు డిస్కౌంట్ల పేరిట మోసం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎల్ఆర్ఎస్ వద్దని ఒంటికాలిపై లేచిన కోదండరాం ఎమ్మెల్సీ కాగానే ఎందుకు మౌనం వహిస్తున్న డు? పదవి రాగానే ఆయన నోటికి తాళంపడిందెందుకు? మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలుపుకోసం కాంగ్రెస్ 90 కోట్లు ఖర్చు చేసిందని ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి చెప్పినా ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పం దించడంలేదు? బడేభాయ్-చోటేభాయ్ బం ధంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు మౌనం వహిస్తున్నాయా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఇందిరమ్మ పాలన అంటే విచ్ఛలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్‌గాంధీ ఈ వ్యవహరంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్ పాలనలో పోలీసులు ఎమ్మెల్యేల కు కాపాలా ఉంటున్నారు..ఇందిరమ్మ రాజ్యం పోలీసు రాజ్యమైంది..అక్రమ కేసులు, నిర్బంధాలు సర్వసాధారణమైపోయాయి.. నా 46 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఆవేదనతో చేసిన వ్యా ఖ్యలే కాంగ్రెస్ ప్రజాపాలన పేరిట సాగిస్తున్న నిరంకుశత్వానికి అద్ధం పడుతున్నయి’ అని హరీశ్ దునుమాడారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులు, అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ మొదటి నుంచీ చెప్తున్న విషయం ఉత్తర తెలంగాణకు చెందిన జీవన్‌రెడ్డి, దక్షిణ తెలంగాణకు చెందిన చిన్నారెడ్డి వ్యాఖ్యలతో తేటతెల్లమైందన్నారు.
ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని చెప్పిన కాంగ్రె స్, ఇప్పుడు ప్రజల ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమైందని ఆగ్రహంవ్యక్తం చేశా రు. నాడు ఓట్ల కోసం ప్రజలను రెచ్చగెట్టిన భట్టి విక్రమార్క, సీతక్క, ఉత్తమ్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వసూళ్ల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. సీఎం, మంత్రు లు స్టేట్స్మన్ల తరహాలో కాకుండా సేల్స్మన్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని కోరారు. తెలంగాణ చరిత్రలో రేవంత్‌రెడ్డి డిస్కౌంట్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని ఎద్దేవాచేశారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారే కారణమని హరీశ్ విమర్శించారు. సొరంగంలో చికుకున్న ఎనిమిది మంది కార్మికులకు చెందిన కుటుంబాల ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘తప్పు చేసిన ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నది. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు తప్పుడు కూతలు కూస్తున్నరు. ఎనిమిది కార్మికులు టన్నెల్లో చిక్కుకుంటే మంత్రులు చోద్యం చూస్తున్నరు. నాడు తెలంగాణను ఎండబెట్టేందుకే సమైక్య పాలకులు సాధ్యంకాని ప్రాజెక్టును నెత్తిన రుద్దిండ్రు. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టబయలు చేసిండ్రు. అయినా అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో ప్రాజెక్టును కొనసాగించిండ్రు.
ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు రూ.3600 కోట్లు ఖర్చుపెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3900 కోట్లు ఖర్చు చేసింది. 11.48 కిలోమీటర్ల టన్నెల్ తవ్వడంతో పాటు శ్రీశైలం లెఫ్ట్ కెనాల్‌పై డిండి, పెండ్లిపాక ప్రాజెక్టులను సైతం పూర్తిచేసింది. కానీ బీఆర్ఎస్ పనులు చేయకపోవడంతోనేనని మంత్రులు ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నరు. నాడు నాతో పాటు టన్నెల్ పనులను చూసేందుకు వచ్చిన జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో పనులు సాగలేదని చెప్పడం దుర్మార్గం. దురదృష్టకర ఘటనపై బీఆర్ఎస్ రాజకీయం చేయదలుచుకోలేదు. రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతాయనే ఘటనాస్థలానికి వెళ్లలేదు. కానీ కాంగ్రెస్ మంత్రులు ఇష్టారీతిన బీఆర్ఎస్పై బురదజల్లు తుండడంతో వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు స్పందించక తప్పడంలేదు’ అని వివరించారు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి కోసం కాంగ్రెస్ రూ.90 కోట్లు ఖర్చు చేసిందని, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చామని ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి బట్టబయలు చేసినా ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించడం లేదు? పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసి కేసు ఎందుకు నమోదు చేయలేదు? బడేభాయ్-చోటేభాయ్ మైత్రి బంధంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు మౌనం వహిస్తున్నయా?
– హరీశ్‌రావు
కాంగ్రెస్ 14 నెలల పాలనలోనే 4 ప్రాజెక్టులు కుప్పకూలాయని హరీశ్ విమర్శించారు. ‘ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయింది.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం పంప్‌హౌస్ నీట మునిగింది.. హైదరాబాద్‌కు తాగునీరందించే సుంకిశాల కుంగిపోయింది. ఇప్పుడు ఏకంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలింది’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగితేనే నాడు నానాయాగీ చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
గతంలో మేడిగడ్డ పిల్లర్ కుంగితే ఆఘమేఘాలపై స్పందించిన ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఎస్ఎల్బీసీపై ఎందుకు స్పందించడంలేదని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని హరీశ్ ప్రశ్నించారు. ఐదు రోజులైనా రాష్ర్టానికి రాకపోవడంలోని ఆంతర్యమేమిటని నిలదీశారు. రేవంత్‌ను కాపాడేందుకే కిషన్‌రెడ్డి చీకట్లో ఒప్పందం చేసుకున్నారని, మంత్రులు కూడా ప్రకృత్తి విపత్తు అంటూ సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ప్రజల ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఆషాఢం సేల్, దీపావళి బొనాంజా, దంతేరాస్ ఆఫర్ల మాదిరిగా 25 శాతం డిస్కౌంట్ అంటూ పేద, మధ్య తరగతి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నది. భవిష్యత్తులో వన్‌ప్లస్ వన్ ఆఫర్లు, లక్కీ డ్రాలు పెట్టినా ఆశ్చర్యం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఆలోచించి ఓటేయాలని హరీశ్ కోరారు. వానకాలం రైతుబంధు, మొదటి ఏడాదిలో 2 లక్ష ల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్, మ హిళలకు స్కూటీలు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం వచ్చినవారే కాంగ్రెస్‌కు ఓటేయాలని సూచించారు. లేదంటే ఈ ఎన్నికల్లో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని విజ్ఞప్తిచేశారు. బీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ఓడినా ఒరిగేదేం ఉండదని సీఎం రేవంత్ ఎన్నికల సభల్లో చెప్ప డం విడ్డూరంగా ఉన్నది. అంటే గ్రాడ్యుయేట్లు, మేధావులైన టీచర్ల ఓట్లు తమకు వద్దని పరోక్షంగా చెప్పి అవమానించారు’ అని హరీశ్ ఆక్షేపించారు. ఓడిపోతామనే విషయం ముఖ్యమంత్రికి కూడా అర్థమైందని, అందుకే మొన్న నిజామాబాద్ సభలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా ఫరక్ పడేదేమీ ఉండదని చెప్పి ఓటమిని అంగీకరించారని చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీహార్, ఆంధ్రప్రదేశ్‌కు పెద్దమొత్తంలో నిధులిచ్చి తెలంగాణకు తెడ్డుచూపిన బీజేపీ అభ్యర్థిని ఓడించాలని గ్రాడ్యుయేట్లు, టీచర్లకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
కృష్ణా జలాల వినియోగంపై ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని హరీశ్ మండిపడ్డారు. కేఆర్ఎంబీ ఫస్ట్ మీటింగ్‌లోనే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పారని విమర్శించారు. తనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎత్తిచూపగానే కేంద్రానికి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బనకచర్లకు అనుమతులు సాధించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని, కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే 640 టీఎంసీల నీళ్లు తరలించుకుపోయినా చీమకుట్టినట్టయినాలేదని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఏపీ పోలీసులు, నాగర్జునసాగర్పై కేంద్ర బలగాలకు అప్పజెప్పి గుడ్లప్పగించి చూస్తున్నారని విమర్శించారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారే కారణం. సమైక్య పాలకులు తెలంగాణను ఎండబెట్టేందుకే సాధ్యంకాని ప్రాజెక్టును మన నెత్తిన రుద్దిండ్రు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ బట్టబయలు చేసిండ్రు. అయినా అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో ప్రాజెక్టును కొనసాగించినం. 11.48 కిలోమీటర్ల టెన్నెల్‌ను తవ్వి శ్రీశైలం లెఫ్ట్ కెనాల్‌పై డిండి, పెండ్లిపాక ప్రాజెక్టులను సైతం పూర్తిచేసినం. ఇప్పుడు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నరు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కలి సి గురువారం ఎస్ఎల్బీసీ ఘటనా స్థలానికి వెళ్తామని హరీశ్ చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మానవత్వంలేదని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని, ఆయన సూచన మేరకు సమస్య పరిష్కారానికి సలహాలు కూడా ఇస్తామని చెప్పారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లే బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవద్దని కోరారు.