Harish Rao | బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళనకు దిగారు. కమీషన్లు ఇచ్చిన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు క్లియర్ చేస్తూ.. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ వేధిస్తోందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్‌లోని సీఎం రేవంత్ రెడ్డి చాంబర్ ముందు బిల్లుల కోసం నిరసన చేపట్టారు. 20 నెలల్లోనే రూ.2లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన రేవంత్ సర్కార్.. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వేధించడం దుర్మార్గమని మండిపడ్డారు.
సెక్రటేరియట్లో కాంట్రాక్టర్ల ధర్నాపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు స్పందించారు. రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం రెండు సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితి రావడం దేశంలో ఇదే మొదటిసారి కావచ్చని అభిప్రాయపడ్డారు. మొన్న కమీషన్లు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయడం లేదని కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారని తెలిపారు. నేడు అదే సచివాలయం సెకండ్ ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా చేశారని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో సీనియారిటీ పాటించకుండా, కమీషన్లు దండుకుంటున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని హరీశ్‌రావు తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా? లేక స్కాంగ్రేస్ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఒక మిషన్ లేదు, విజన్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఒక్కటే.. టార్గెట్ కమీషన్ అని విమర్శించారు. ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే ప్రజలంతా ఏకమై ఎక్కడిక్కడ నిలదీస్తారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం రెండు సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితి రావడం దేశంలో ఇదే మొదటిసారి కావచ్చు.
మొన్న కమీషన్లు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయడం లేదని కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు.
నేడు అదే సచివాలయం… pic.twitter.com/WyEynR8Rs6
— Harish Rao Thanneeru (@BRSHarish) August 18, 2025