Harish Rao | రేవంత్ రెడ్డి ఏడాది పాలనతో గురుకులాలు, హాస్టళ్ళు అన్ని ఆగమైపోయిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో వేలాదిమంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 49 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్‌ను హరీశ్‌రావు గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వసతీగృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని విమర్శించారు.
కేసీఆర్ 1000 పైగా గురుకులాలు స్థాపించి గురుకులాల గౌరవాన్ని ఎవరెస్టు శిఖరం అంత ఎత్తులో పెట్టారని హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారని అన్నారు కానీ.. ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలుగా మెస్ చార్జీల చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు. దాదాపు 9.50 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. హాస్టల్ వార్డెన్లు బంగారం కుదవబెట్టి అప్పులు తెచ్చి విద్యార్థులు ఆకలి తీరుస్తున్నారని తెలిపారు. మెస్ చార్జీలు సకాలంలో చెల్లించకపోతే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా పెడతారని ప్రశ్నించారు. విద్యార్థులు ఆస్పత్రి పాలైతే ఉపాధ్యాయులను, వార్డెన్లను సస్పెండ్ చేస్తా అంటున్నావ్.. శిక్ష రేవంత్ రెడ్డికి వేయాలని సూచించారు. మెస్ చార్జీలు పెండింగ్‌లో పెట్టింది రేవంత్ రెడ్డి, కాబట్టి శిక్ష ముఖ్యమంత్రికి వేయాలన్నారు.
Harish Rao2
ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు మెస్ చార్జీలు విడుదల చేయలేదని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటవని ఎద్దేవా చేశారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందేమో అని వ్యాఖ్యానించారు. గత సంవత్సరం విద్యార్థులకు ప్లేటు, గ్లాసు, స్పూన్, టవల్స్, స్కూల్ యూనిఫార్మ్స్ అన్ని సకాలంలో అందాయని.. కానీ ఈ సంవత్సరం ఇవేవీ ఇవ్వలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ పుట్టిన రోజుకు రేవంత్ రెడ్డి ఫుల్ పేజీ పేపర్ యాడ్ ఇస్తున్నారు.. తొమ్మిది రోజుల విజయోత్సవాలు జరుపుకున్నారు.. కానీ ఈ పిల్లలకు బుక్కెడు అన్నం పెట్టే చాతకాదా అని మండిపడ్డారు. విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు ఏడాది విజయోత్సవాలు చేసుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆడపిల్లల హాస్టళ్లలో చలికాలం వేడి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్, నవంబర్ మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు. పార్ట్ టైం ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. 8 నెలల నుంచి జీతాలు చెల్లించకపోతే వారు ఎలా పని చేస్తారు? వాళ్ల కుటుంబాన్ని ఎలా పోషిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆరు నెలలుగా కాస్మెటిక్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలన అని విమర్శించారు. కోతలు ఎక్కువ చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు.
Harish Rao4
వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్ వల్ల బాలికలు ఆసుపత్రిలో పాలైతే వారిని పరామర్శించేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం సక్రమంగా హాస్టళ్లు నడుపుతున్న మాట నిజమైతే మాజీ మంత్రులు పోతుంటే ఎందుకు అడ్డుకున్నావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీ తప్పులు, మీ లోపాలు బయటపడతాయని సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్నారని విమర్శించారు. అరెస్టులు కాదు చేయాల్సింది, పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టు అని మండిపడ్డారు. సంవత్సర కాలం నుంచి హాస్టల్ భవనాలకు అద్దెలు చెల్లించడం లేదని.. వెంటనే హాస్టల్ రెంట్లను చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఏనాడైనా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్‌కు వెళ్లి విద్యార్థుతో భోజనం చేశావా అని ప్రశ్నించారు. ఒకనాడైనా విద్యార్థులను పరామర్శించావా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు వేరు అని అన్నారు. ఫోర్త్ సిటీ కడతా ఆరు లైన్ల రోడ్డు మీ భూముల దాకా వేసుకుంటా.. ఇవి నీ ప్రాధాన్యతలు అని మండిపడ్డారు. కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరుతో వృథా చేశారని తెలిపారు. పిల్లలు భోజనం చేసే అన్నం చూస్తే ఆవేదన కలిగిందని పేర్కొన్నారు.
Harish Rao3
హాస్టల్లో విద్యార్థులకు కేసీఆర్ కడుపునిండా సన్నబియ్యంతో భోజనం పెట్టారని హరీశ్‌రావు గుర్తుచేశారు. మీరు దొడ్డు బియ్యంతో అన్నం పెడుతుంటే ముద్దలాగ అయిన అన్నాన్ని విద్యార్థులు తినలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంత్రులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అంటే చిన్న చూపు అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం హాస్టల్ మెస్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు ఆరు నెలలుగా బిల్లులు విడుదల చేయలేదని హరీశ్‌రావు అన్నారు. ఆరు నెలలుగా బిల్లులు లేకుండా విద్యార్థులకు భోజనం ఏ విధంగా పెడతారని ప్రశ్నించారు. అటెండర్ అన్నం పెడుతున్నప్పుడు విద్యార్థులు అర్ధాకలితో ఉన్నారని.. మెస్ బిల్లులు విడుదల చేయాలని గుర్తు చేయండని సూచించారు. కనీసం అన్నం తినేటప్పుడు అయినా విద్యార్థులు గుర్తొచ్చి మెస్ బిల్లులు విడుదల చేస్తాడేమో అని వ్యాఖ్యానించారు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం కాదని సూచించారు. పాలన అంటే ఇచ్చిన హామీలను అమలు చేయడం.. ప్రజల మధ్యలో ఉండటం అని తెలిపారు. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులు కాదు.. విద్యార్థులకు అన్నం పెట్టాలని హితవుపలికారు.