Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన విజయోత్సవాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు.
ఎన్నికలకు ముందు చెప్పినవి ఏమిటి? ఏడాది గడుస్తున్నా అమలు చేసింది ఏంటని కాంగ్రెస్ పార్టీని సామాన్య ప్రజలు నిలదీస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్‌కు ఎదురవుతున్న పరిస్థితిని చూస్తే అబ్రహం లింకన్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. ఆ వ్యాఖ్యలను ట్విట్టర్లో ప్రస్తావించారు.
‘ ప్రజలను కొంత సమయం మాత్రమే ఫూల్స్‌ను చేయగలరు. కొంతమంది ప్రజలను అయితే ప్రతిసారి ఫూల్స్‌ను చేయవచ్చు. కానీ ప్రజలందర్నీ అన్నివేళలా ఫూల్స్‌ను చేయడం సాధ్యపడదు.’ అని అబ్రహం లింకన్ వ్యాఖ్యలను హరీశ్‌రావు ఉటంకించారు.
కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో విజయోత్సవాల పేరిట చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొడుతున్న ప్రజలు.
ఎన్నికలకు ముందు చెప్పినవి ఏమిటి, ఏడాది గడుస్తున్నా అమలు చేసింది ఏమిటి? అంటూ నిలదీస్తున్న సామాన్యులు.
కాంగ్రెస్ కి ఎదురవుతున్న పరిస్థితి చూస్తే అబ్రహం లింకన్ గారు చెప్పిన మాటలు… pic.twitter.com/sQbFdMfEf2
— Harish Rao Thanneeru (@BRSHarish) November 25, 2024
ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన విజయోత్సవాలపై ఎక్కడికక్కడ సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో విజయోత్సవాల కళాకారులను అడ్డుకున్నారు. ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయని నిలదీశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోనూ స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో చెప్పాలని నిలదీశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధాలు ఎందుకు చెబుతున్నారని వారిని గ్రామం నుంచివెళ్లగొట్టారు.