Harish Rao | చికెన్, కోడిగుడ్ల విషయంలో సోషల్‌మీడియాలో సృష్టించే అపోహలను నమ్మవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళాలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాగా ఉడకపెట్టిన చికెన్ తింటే ఎలాంటి వైరస్ సోకదని స్పష్టం చేశారు.
పౌల్ట్రీ రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మక్కలు, విద్యుత్ సబ్సీడీపై ఇచ్చిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పౌల్ట్రీ రైతులను పట్టించుకోవడం లేదని తెలిపారు. గతంలో ఇలాగే చికెన్‌పై అపోహలు వస్తే కేసీఆర్‌తో పాటు ప్రజాప్రతినిధులు అందరూ చికెన్ తిని ఆ అపోహలను దూరం చేసిన ప్రజలకు నమ్మకం కలిగించామని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేది చికెన్, కోడిగుడ్డు మాత్రమేనని తెలిపారు.
70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడకపెడితే ఎలాంటి వైరస్ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థనే చెప్పిందని హరీశ్‌రావు తెలిపారు. సోషల్‌మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. రైస్, రోటీ కంటే చికెన్, గుడ్డే ఆరోగ్యానికి మేలు అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద పౌల్ట్రీ సిద్దిపేట జిల్లాలోనే ఉందని అన్నారు. చికెన్ తింటే ఎలాంటి హాని లేదని.. తాను కూడా చికెన్ తింటున్నానని.. మీరందరూ కూడా తినండని సూచించారు.