Harish Rao | రేవంత్ రెడ్డి రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు విమర్శించారు. మహారాష్ట్రకు వెళ్లి అన్ని అబద్దాలే ప్రచారం చేస్తున్నాడని.. మొదటి సంతకం ఏకకాలంలో రుణమాఫీ అన్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 2023 రుణమాఫీ చేస్తామని మాట తప్పామని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. 42 లక్షల మందికి రూ.31 వేల కోట్ల చేస్తామని.. రూ.17వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు.
రుణమాఫీ చేశామని ట్విట్టర్లో ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. 40 లక్షలు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. రుణమాఫీ 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీల భారం మోపింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బ్యాంకులు ముక్కుపిండి రైతుల నుంచి వడ్డీలు వసూలు చేశాయని.. ప్రభుత్వం ఆలస్యం చేయటంతో రైతులపై వడ్డీ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు అబద్ధాలు కాదు తెలంగాణలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిజాన్ని చెప్పాలని హితవుపలికారు.
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. రైతు భరోసా ఇచ్చామని చెప్పగలరా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఇచ్చారా.. రైతు కూలీలకు ఇచ్చిన హామీ ఇవ్వలేదని చెప్పాలన్నారు. వరి పంటకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్న వడ్లను ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు తక్కువ రేటుకు దళారులకు అమ్ముకునే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడైనా బోనస్ వస్తుందా రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ కూడా వడ్లు కొనే పరిస్థితి లేదని హరీశ్‌రావు అన్నారు. మద్దతు ధరకు వడ్లు కొనకపోవటంతో రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1900కే వడ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని వడ్లకు ఎంఎస్పీ, బోనస్ ఇస్తున్నానని ప్రకటించాడని అన్నారు. రేవంత్ రెడ్డి అసమర్థత పాలనకు రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే సాక్ష్యమని మండిపడ్డారు. బోనస్ ఇచ్చానని బోగస్ మాటలు మాట్లాడాడని విమర్శించారు.
అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు విమర్శించారు. నిరుద్యోగత యువతకు ఇస్తానన్న రూ. 4 వేల భృతి ఏమైందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో యువతను మోసం చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఎన్నికల హామీలను ఎగవేయటమే కాంగ్రెస్ నైజంగా మారిందని అన్నారు. రేవంత్ ఇస్తామన్న గ్యారెంటీలు ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. గెలిచేదాకా గ్యారెంటీలు.. గెలిచిన తర్వాత గ్యారెంటీలు గ్యారేజీకి అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం గ్యారెంటీల వల.
గెలిచాకా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటర్లు విలవిల అని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో పోలీసు కానిస్టేబుల్స్ రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి వచ్చిందని హరీశ్‌రావు అన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. సోనియమ్మ మాట.. రాహుల్ గాంధీ మాట అంటూ హామీలిచ్చారని.. ఇప్పుడా గాంధీలు ఎక్కడికి పోయారో తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పేదానికి.. చేసేదానికి పొంతనలేదని అన్నారు. మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదని అన్నారు. వడ్డీ లేని రుణం రూ. 5 లక్షల వరకే ఉందని.. ప్రతీ అప్పుకు వడ్డీ లేని రుణం వర్తిస్తుందో చెప్పాలని నిలదీశారు.
24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుల ఉచిత నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ అని అన్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ నిజాలు చెబుతున్నా అని చెప్పి పచ్చి అబద్దాలు చెప్పారని అన్నారు. రేవంత్ నోరు విప్పితే అన్ని అబద్దాలే అని విమర్శించారు. మహారాష్ట్ర ప్రజల్ని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు డబ్బులు పంపించే పనిలో సీఎం రేవంత్ బిజీగా ఉన్నారని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంతే డబ్బులు సమకూర్చుతున్నారని అన్నారు.
పాలన గాలికి వదిలి.. మంత్రులు రాష్ట్రాల బాట పట్టారని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ డబ్బును రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నాడని తెలిపారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి అనుకూలంగా.. వ్యతిరేకంగా ప్రచారం చేయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై వాస్తవాలు చెప్పటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.