Harish Rao | నేను పత్రికా సమావేశం పెట్టిన తర్వాతనైనా మేల్కొని మొన్నటి డేట్ జనవరి 22, 2025 తో లెటర్ రాసి, ఈరోజు విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ధన్యవాదాలు అని హరీశ్‌రావు అన్నారు. మొన్న 22వ తేదీనే నిజంగా లేఖ రాసి ఉంటే, ఆ రోజే మీరు మీడియాకు ఇచ్చి ఉండే వారు కదా? ఈరోజు వరకు దాచిపెట్టరు కదా? అని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా, పెన్నా లింకింగ్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి 15.11.2024న లేఖ రాస్తే, దాని నిధుల కొరకు 31.12.2024న మరొక లేఖ రాస్తే, మీరు ఈరోజు వరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఉత్తరాలు ఎందుకు రాయలేదు, ఎందుకు ఆ ఉత్తరాలను విడుదల చేయలేదని ప్రశ్నించారు.
గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై నా వ్యాఖ్యలను మీరు వక్రీకరించడం శోచనీయమని హరీశ్‌రావు అన్నారు. నేను 200 టీఎంసీలు తీసుకుపోతున్నానని ఎక్కడ అన్నానని ప్రశ్నించారు. తీసుకుపోయేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేస్తుంటే మీరు మౌనం వహిస్తున్నారని తప్పుబట్టానని అన్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం నేను ప్రశ్నిస్తే గానీ, మీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. 512-299 ఒప్పందం అనేది ఒకే ఏడాదికి అని మీరు విడుదల చేసిన డాక్యుమెంట్లలోనే స్పష్టంగా ఉందని.. మంత్రి హోదాలో ఉండి ఎందుకు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ 512-299 ఒప్పందం ఉండి ఉంటే, సెక్షన్ 3 ప్రకారం, నీటి పంపకాలు అనే విషయం ఎందుకు ఉత్పన్నమైతదని అన్నారు. సెక్షన్ 3 కోసం బీఆర్ఎస్ ఎందుకు పట్టుబట్టిందని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ సమావేశానికి మంత్రి హోదాలో హాజరైన మొదటి వ్యక్తి నేనొక్కడినే అని మరో అబద్దం చెబుతున్నారని మండిపడ్డారు.
2016లోనే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా నేను ట్రిబ్యునల్ మీటింగ్ లో పాల్గొని తెలంగాణ పక్షాన కొట్లాడామని హరీశ్‌రావు గుర్తుచేశారు. మీటింగ్ మినట్స్‌లో ఉంటది చూసుకోండని సూచించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలోనూ నోటికి వచ్చిన అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదనేది పచ్చి అబద్దమని స్పష్టం చేశారు. ఇదే అబద్దాన్ని పదే పదే చెబుతున్నారని మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే వ్యతిరేకిస్తూ పుంఖానుపుంఖాలుగా లేఖలు రాశామని హరీశ్‌రావు గుర్తుచేశారు. కేఆర్ఎంబీకి, కేంద్ర ప్రభుత్వానికి, జలశక్తి మంత్రి షెకావత్ కి ఎన్నో ఉత్తరాలు రాశామన్నారు. తాము చేసిన ఒత్తిడికి రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయొద్దని జలశక్తి మంత్రి షెకావత్ కూడా ఏపీకి లేఖ రాశారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉన్నదని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ద్వారా స్టే తీసుకొచ్చామన్నారు. సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో కూడా వ్యతిరేకంగా మాట్లాడినవి మీటింగ్ మినట్స్ లో ఉంటాయి.. నేను పంపిస్తున్నా చూసుకోండి మంత్రి గారూ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగి ఉన్నాయంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి వల్లనే అన్నది దాచేస్తే దాగని సత్యమని స్పష్టం చేశారు. నేను మాట్లాడింది గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం గురించి అయితే, ఆ విషయం మాట్లాడకుండా ఏవోవో మాట్లాడి, డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. మీరు చెప్పిన అబద్దాలకు పూర్తి వాస్తవాలతో పత్రికా సమావేశం నిర్వహిస్తానన్నారు. మీ అబద్దపు ప్రచారాన్ని పటాపంచలు చేస్తానని అన్నారు.
Harish Rao1
Harish Rao2