Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇంత కంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా అని నిలదీశారు.
రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. వాళ్ళ భూములు గుంజుకుంటారు.. తిరగబడితే అరెస్టులు చేస్తారు.. వాళ్ళను ఉగ్రవాదులుగా భావిస్తూ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తారని విమర్శించారు. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం. ఇదేనా మీ ప్రజాపాలన అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ముమ్మాటికి మీది ప్రజా కంటక పాలన.. రైతు కంటక పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుండె నొప్పి వచ్చిన రైతన్నకు సంకెళ్లు (Hand Cuff) వేయడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. హీర్యా నాయక్ కి గుండెల్లో నొప్పి వస్తే వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా అమానవీయంగా వ్యవహరించిందని విమర్శించారు.
గురువారం ఉదయం రెండోసారి మళ్లీ గుండెపోటు రావడంతో అతడిని సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఆయనతో పాటు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి కి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.
గుండెపోటు వచ్చిన రైతుకు ప్రభుత్వం స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సి ఉండగా బేడీలు వేసి తీసుకురావడం శోచనీయమని అన్నారు. రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమే నని స్పష్టం చేశారు. నూతన క్రిమినల్ చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా, పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రయల్స్ ఖైదీల హక్కులను హరించడమేనని వెల్లడించారు