Harish Rao | ప్రజల తరఫున పోరాటం చేస్తామంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తన మీద, కేటీఆర్ మీద బుల్డోజర్లు ఎక్కిస్తానని, చంపేస్తానని బెదిరిస్తున్నారని తెలిపారు. నువ్వు చంపుతామన్నా, కేసులు పెడతామన్న భయపడేది లేదని స్పష్టం చేశారు. పేదలకు అన్యాయం జరిగితే ఏ పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. చావడానికైనా సిద్దమని తెలిపారు. మానకొండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సమావేశం చూస్తే 2001 నాటి రోజులు గుర్తు వస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. రసమయి బాలకిషన్ ఉద్యమ సయమంలో ధూంధాం పేరిట ఎంతో జాగృతం చేసిండని తెలిపారు. మరోసారి రైతులను, ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ మీద పోరాటానికి మరో ధూంధాం మొదలుపెట్టే రోజులు వచ్చినాయని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి హామీలు ఇప్పించిండని అన్నారు. కాంగ్రెస్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.
పేద ప్రజల కోసం చావడానికైనా మేము సిద్ధమే Mr. @revanth_anumula
పేదల ఇండ్లు కూలగొడితే చూస్తూ ఊరుకునేది లేదు. వదిలిపెట్టేది లేదు, నీ వెంట పడతనే ఉంటం.#CongressFailedTelangana pic.twitter.com/OX1Gkgj5Ly
— Harish Rao Thanneeru (@BRSHarish) October 20, 2024
‘ కేసీఆర్ బతుకమ్మ పండుగ వేళ చీరెలు ఇచ్చిండు. కేసీఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లు ఇచ్చిండు, చెరువుల్లో చేపలు వేసిండు. గొర్రెలు ఇచ్చిండు’ అని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయని అన్నారు.
పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చిందన్నారు. ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఆపలేదని గుర్తుచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ రైతులకు రైతు బంధు ఇచ్చిండని తెలిపారు. ఇప్పుడు కరోనా లేదు.. కానీ వాళ్లు చెప్పిన 15వేల రైతు భరోసా ఎందుకు పడటం లేదని ప్రశ్నించారు. రైతులను ఘోరంగా మోసం చేశారని.. అందుకే రేవంత్ రెడ్డి మీద అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మోసం చేసినా కాంగ్రెస్‌ను ఊరుకుందామా.. ఉరికిద్దామా అని అడిగారు. రైతు బంధు కింద కేసీఆర్11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలు ఇచ్చాడని హరీశ్‌రావు తెలిపారు. రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డిపై పోరాటానికి రైతులు సంఘటితం కావాలని.. గట్టిగా పోరాడాలన్నారు. లేదంటే యాసంగికి కూడా రైతు భరోసా ఎగ్గొడతాడని హెచ్చరించారు.
రైతుల పవర్ రేవంత్ రెడ్డికి అర్థం కావాలన్నారు.
మహిళలకు నెలకు రూ.2500 ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడని.. ఇప్పుడు ప్రతి మహిళకు 25 వేలు బాకీ పడ్డాడని హరీశ్‌రావు తెలిపారు. బతుకమ్మ చీరలకు బదులు 500 ఇస్తానని ఎగొట్టాడని, 4 వేల పింఛన్ ఇస్తానని మాట తప్పాడని విమర్శించారు. పింఛన్ పెంచుతానని చెప్పి రెండు నెలలు ఎగ్గొట్టిండని అన్నారు. పింఛన్లు దగా, రైతులకు బోనస్ దగా, తులం బంగారం దగా, విద్యార్థులకు జాబ్స్ దగా, మహిళలకు రూ.2500 దగా.. అన్ని దగా అని అన్నారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రెడ్డి అని, చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మ్యాన్ అని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగ యువత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుందని హరీశ్‌రావు అన్నారు. బందిపోట్లు, కిరాతకులు, దొంగలనుకొట్టినట్లుగా నిరుద్యోగులను ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి మరీ విద్యార్థులను బతిమిలాడారని.. ఇప్పుడు ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లైబ్రరీ వెళ్లాలని సవాలు విసిరారు. జీవో 29 రద్దు చేయాలని ఉద్యోగార్థులు అంతలా డిమాండ్ చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిన అవకాశాలను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకు రాజ్యంగా ఫలాలు దక్కకూడదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కానీ.. రేవంత్ మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నడని విమర్శించారు. ఆరు గ్యారంటీల బాధ్యత మాది అని చెప్పిన రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. అధికారం వచ్చాక వాళ్లు పత్తా లేకుండా పోయారని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగిన మానకొండూరులో బీఆర్ఎస్దే విజయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వికృత వైఖరి పట్ల గ్రామగ్రామాన చర్చలు పెట్టాలని సూచించారు. ప్రజలు, రైతులు, యువత అందరికీ అర్థమయ్యేలా వివరించాలని అన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తామంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తన మీద, కేటీఆర్ మీద బుల్డోజర్లు ఎక్కిస్తానని అంటున్నాడని.. చంపుతానని బెదిరిస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. నువ్వు చంపుతానన్న, కేసులు పెడతానన్న, అరెస్టులు చేస్తామన్నా భయపడేది లేదని స్పష్టం చేశారు. పేదలకు అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేసే దాకా వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
సమైక్య నాయకులు, కర్కశ కాంగ్రెస్‌తో కొట్లాడినమని.. రేవంత్ రెడ్డి ఎంత అని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడూ ఉద్యమం చేయలేదని.. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించలేదని విమర్శించారు. లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని సూచించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడమే ప్రతిపక్షం బాధ్యత అని.. ఆ పనే కేసీఆర్, బీఆర్ఎస్ చేస్తుందని తెలిపారు. పోరాడుతాం, ప్రశ్నిస్తామని తెలిపారు. చట్టం ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు సూచించారు. రేవంత్ రెడ్డి శాశ్వతం కాదని అన్నారు. అతిగా ప్రవర్తించే పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తమ పోరాటంలో ధర్మం ఉందని.. కేసీఆర్ పాలన తెచ్చే వరకు అందరం కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.