హైదరాబాద్ : కేసీఆర్ ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలపై రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌లో స్పందించిన తీరును బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తప్పుపట్టారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ఒక స్టేట్స్మెన్లా మాట్లాడితే.. రేవంత్ రెడ్డి స్ట్రీట్ రౌడీలా మాట్లాడారని విమర్శించారు. ఓ గల్లీ రౌడీ మాటల్లా, ఓ గూండా మాటల్లా రేవంత్‌రెడ్డి మాటలు ఉన్నాయని విమర్శించారు.
తెలంగాణకు ఒక నొక్కుపడనియ్యను అని కేసీఆర్ చాలా గొప్పగా మాట్లాడారని, ఆ మాటతో సీఎం రేవంత్‌రెడ్డికి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన నొప్పి ఏమిటో అర్థం కావడం లేదని హరీశ్ రావు అన్నారు. తప్పు చేసిండ్రు కాబట్టే వాళ్లకు నొప్పి కలుగుతున్నదని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిన్న ఉత్తరకుమారుడిగా తేలిపోయారని ఎద్దేవా చేశారు. ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ఎందుకు పెంచలేదని కేసీఆర్ ప్రశ్నించారని, దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నదని, నిధులు ఎలా సమీకరించాలో, ప్రజలకు ఎలా ఇవ్వాలో బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పిండ్రు కదా.. ఇప్పుడు ఏమైంది మీ అనుభవం అని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మీ అనుభవం అంతా దోపిడీలకు, కమిషన్లకు, వాటాలకు, లూటీలకే సరిపోయిందా..? అని ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ హయాంలో ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేస్తే యూరియా బస్తాలు తెచ్చి ఇంట్లో వేసి వెళ్లేవారని, ఇప్పుడు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చిందని, యాప్‌లు, మ్యాప్‌లతో రైతులను ఎందుకు గోసపెడుతున్నరు’ అని కేసీఆర్ ప్రశ్నించారు. దానికి మీ సమాధానం ఏదీ అని హరీశ్‌రావు క్వశ్చన్ చేశారు.
హైదరాబాద్ నగర శ్రేయస్సు కోసం తాము పార్మాసిటీ కోసం కేటాయించిన స్థలంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎందుకు అంటున్నారని కేసీఆర్ అడిగిన ప్రశ్నకు సీఎం నుంచి సమాధానం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల గురించి, హైదరాబాద్ శ్రేయస్సు గురించి మాట్లాడితే.. రేవంత్ రెడ్డి అంతా సొల్లు మాట్లాడారని విమర్శించారు. ‘కేసీఆర్ హయాంలో ఆర్థిక అరాచకత్వం సాగింది’ అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలపై కూడా మాజీ మంత్రి మండిపడ్డారు.
ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో నువ్వు ఆహ్వానించిన ప్రముఖులే తెలంగాణ ఆర్థిక ప్రగతిని కొనియాడారని హరీశ్‌రావు గుర్తుచేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావు మాట్లాడిన మాటలను రేవంత్ రెడ్డి ఒకసారి వీడియో పెట్టుకుని చూడాలని సూచించారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అద్భుతమైన ఆర్థిక ప్రగతిని సాధించిందని, మూడు రెట్ల జీఎస్డీపీని సాధించిందని, మూడు రెట్ల తలసరి ఆదాయం పెరిగిందని వారు కేసీఆర్ పాలనను మెచ్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు.