Harish Rao | కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సిద్దిపేటలో కొలువు దీరనుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. మంగళవారం తిరుపతి వెళ్లిన హరీశ్ రావు టీటీడీ బోచైర్మన్ బీఆర్ నాయుడిని కలిశారు. సిద్దిపేట కోమటి చెరువు ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం చేపట్టాలని కోరారు.
వేంకటేశ్వర ఆలయ నిర్మాణం కోసం సిద్దిపేట కోమటి చెరువు ప్రాంతంలో 5 ఎకరాల 10 గుంటల స్థలాన్ని మంజూరు చేశామని టీటీడీ చైర్మన్‌తో హరీశ్‌రావు తెలిపారు. గతంలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణ నమునా, డిజైన్స్ ను రూపొందించారని వివరించారు.
తిరుపతి వేంకటేశ్వర స్వామి అంటే ప్రజలు ఇష్ట దైవంగా.. ఇలవేల్పుగా కొలుస్తారని, అలాంటి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం గొప్ప అదృష్టమని హరీశ్‌రావు అన్నారు. వచ్చే టీటీడీ బోర్డు మీటింగ్‌లో సిద్దిపేటలో వెంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపి, మీరే ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా బీఆర్ నాయుడిని కోరారు. అందుకు చైర్మన్ బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. వెంటనే చీఫ్ ఇంజనీర్ అధికారి, సంబంధిత అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.