Harish Rao | అల్లు అర్జున్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై హరీశ్‌రావు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనను తాము సమర్థించడం లేదని తెలిపారు. అక్కడ ఒక మహిళ చనిపోవడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తుందని పేర్కొన్నారు. ఇంత మాట్లాడుతున్నావ్ కదా.. ఇవాళ చట్టం కాంగ్రెస్‌కు, రేవంత్ రెడ్డికి చుట్టమైందా అని ప్రశ్నించారు.
నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్.. నీ తమ్ముడి వాళ్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ రాస్తే అతన్ని ఎందుకు అరెస్టు చేయవని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. నీ తమ్ముడికో రూల్.. ప్రజలకో రూల్ ఉంటుందా అని నిలదీశారు. నీ తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయలేదని అడిగారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నీ తమ్ముడికి చట్టం చుట్టమైందా అని మండిపడ్డారు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.. కేసు నమోదు చేయలేదు.. వాళ్లను బెదిరించి, భయభ్రాంతులకు గురి చేశావు కదా అని మండిపడ్డారు.
ఏదో ప్రజల మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నాణ్యమైన అన్నం పెట్టడం చేతగాకపోవడంతో వాంకిడి హాస్టల్లో శైలజ అనే గిరిజన విద్యార్థిని 12 రోజులు నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడి, పోరాడి శ్వాస విడిచిందని గుర్తుచేశారు. మరి ఆ శైలజను పరామర్శించేందుకు రేవంత్‌కు ఒక్క నిమిషం టైమ్ దొరకలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులకు ఒక్క నిమిషం దొరకలేదా అని మండిపడ్డారు. చివరకు గిరిజన విద్యార్థి చనిపోతే అంత్యక్రియలకు వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీని అర్ధరాత్రి 12గంటలకు అరెస్టు చేశారని విమర్శించారు. ఇదేనా నీ ప్రజా పాలన అని మండిపడ్డారు.
ప్రేమ అందరి మీద ఉండాలి కదా.. నీకు అవసరమైతే ప్రేమ లేకపోతే విషమా అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శైలజను ఎందుకు పరామర్శించలేదు.. శైలజ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేదు.. శైలజ అంత్యక్రియలకు వెళ్లకుండా మా ఎమ్మెల్యేను అరెస్టు చేశారని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డిది అంతా మొసలి కన్నీరు.. డ్రామా అని హరీశ్‌రావు విమర్శించారు. అవసరానికో పాట పాడుతడు. మాట మాట్లాడతాడని అన్నారు. రేవంత్ రెడ్డిలో నిజాయితీ లేదని అన్నారు.