Harish Rao | సిద్దిపేటలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసు క్రీస్తు జన్మించిన డిసెంబర్ మాసం వచ్చిందంటే క్రైస్తవులందరికీ సంతోషంగా ఉంటుందని అన్నారు. ఈ క్రిస్మస్ మనందరికీ శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సహనాన్ని, క్షమాగుణాన్ని నేర్పుతుందని పేర్కొన్నారు.
ఎదుటివారి పట్ల జాలి, దయ, క్షమాగుణం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు ప్రబోధించారని హరీశ్‌రావు అన్నారు. తోటివారిని ప్రేమించండి.. తోటి వారికి ఉపకారం చేయండి.. పది మందికి సహాయం చేసినపుడే నీ జన్మ ధన్యమవుతుందని ప్రభువు చెప్పారని తెలిపారు. తనను శిలువ వేసిన వారిని, తనను నానా మాటలు అన్నవారిని కూడా క్షమించండి అన్న గొప్ప దయామయుడు ఏసు క్రీస్తు అని కొనియాడారు. అందుకే ఏసుక్రీస్తు గొప్పతనాన్ని ప్రపంచమంతా గుర్తించిందని అన్నారు.
దేశంలో క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీశ్‌రావు కొనియాడారు. క్రిస్మస్ తెల్లవారి బాక్సింగ్ డే రోజు కూడా కేసీఆర్ సెలవుగా ప్రకటించారని గుర్తుచేశారు. బతుకమ్మ పండుగకు హిందువులు, రంజాన్ పండుగకు ముస్లింలు, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులు కొత్త బట్టలతో ఉండాలని కేసీఆర్ పదేళ్లపాటు తోఫాను అందించారని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు ఇప్పుడున్న ప్రభుత్వం ఆ తోఫాలను కొనసాగించకుండా ఆపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని, మీ కోరికలు, కలలన్నీ నిజం కావాలని ఆకాంక్షిస్తున్నానని హరీశ్‌రావు అన్నారు. మీ భవిష్యత్తు బంగారుమయం కావాలని, ఉజ్వలంగా ఉండాలని ఆ ఏసు ప్రభువును మనసారా ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఏసు ప్రభువు చెప్పిన విషయాలన్నింటినీ మనం జీవితంలో ఆచరించాలన్నారు. అప్పుడే అపుడే ఏసు ప్రభువు పట్ల మనం నిజమైన భక్తి చూపిన వారమవుతామని పేర్కొన్నారు.
పగ, ప్రతీకారాలతో సమాజం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని హరీశ్‌రావు అన్నారు. ఇవాళ కులాల మధ్య చిచ్చు రేగుతున్నదని.. మతాల మధ్య కలహాలు పెరుగుతున్నయని.. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని తెలిపారు. కులమేదైనా, మతమేదైనా, దేశమేదైనా అందరూ సమానమే అని భగవద్గీతలోనైనా, ఖురాన్ లో అయినా, బైబిల్ లో అయినా అదే చెప్పారని అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మనందరికీ సమానమైన హక్కుల్ని కల్పించారని తెలిపారు. కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విభజించి పాలించాలని చూస్తున్నారని.. మనమందరం ఒక్కటై ఆ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మనందరి అభివృద్ధిలోనే రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి ఉన్నదని గుర్తుంచుకొని నడవాలన్నారు.