Harish Rao | కేసీఆర్ కిట్లలో పోటీ పడితే.. రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నాడని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. 100 రోజుల్లో రేవంత్‌రెడ్డి ఏమైనా సాధించారా? అంటే పది సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారని అన్నారు. అంటే ప్రతి 10 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్లి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతుబంధు పడలేదని అడిగితే.. చెప్పుతో కొట్టాలని ఒక మంత్రి చెబుతారని.. ఇదీ వంద రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఘనత అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేశారని.. ఆయనపై సీఎం, మంత్రులు దిగజారి నీచమైన వ్యాఖ్యలు చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. ఈ వంద రోజుల్లో సీఎం మాట్లాడిన తీరు.. ఆయన వ్యవహార శైలితో బడే భాయ్.. చోటే భాయ్ బంధం రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ బద్ధ విరోధులు.. తెలంగాణలో మాత్రం బలమైన బంధంగా కనిపిస్తుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వలసలపై పతివ్రతలా మాట్లాడారని అన్నారు. పార్టీ మారితే వాళ్లను రాళ్లతో కొట్టమని ఆనాడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ నాయకులకు టికెట్ రాకపోతే.. రేవంత్ రెడ్డి నేరుగా ఇంటికే వెళ్లి కలుస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై ఎంతటి ఔదార్యం, ఎంతటి ప్రేమ అంటూ సెటైర్ వేశారు. ఇలా అనేక విషయాలపై రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ముందుగా ఫార్మా సిటీ రద్దు చేస్తామని.. ఆ తర్వాత 3 వేల ఎకరాల్లో ఓ ఫార్మా సిటీ పెడతామని యూటర్న్ తీసుకున్నారని.. అలాగే మెట్రో రైలు రద్దు చేస్తున్నామని ప్రకటించి.. తర్వాత రూటు మారుస్తున్నామంటూ మాట మార్చారని అన్నారు. ఇలా అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో యూటర్న్, యూట్యూబ్ పాలననే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ ఏ ఒక్క విషయంలోనూ కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా మీడియా ముందు ప్రదర్శించారు. గేట్లు ఎత్తితే మీ పార్టీలో ఎవరూ మిగలరని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. పార్టీల గేట్లు ఎత్తడం కాదు.. ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్లు ఇచ్చి పంటలను కాపాడండి అని సూచించారు. పరిపాలించడానికి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారని.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారని వాళ్లను ఆదుకోవాలని హితవు పలికారు.