హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో రేవంత్‌రెడ్డి సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ కాంగ్రెస్, సీఎంపై నిప్పులు చెరిగారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే పండబెట్టిండ్రని కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
‘కేసీఆర్ పదేళ్లపాటు అపరభగీరథుడిలా కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నరు. కాళేశ్వరంపై కక్ష గట్టిండ్రు. పాలమూరుపై పగబట్టిండ్రు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రిటైర్డ్ సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్‌రావు నీళ్లు-నిజాలు అనే పుస్తకం రాశారు. అలాంటి నిపుణుల సలహాలతో పాలమూరు-రంగారెడ్డికి, కాళేశ్వరానికి కేసీఆర్‌గారు రూపకల్పన చేశారు. అసుంటి ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద ఇయ్యాల రెండు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టిండ్రు’ అని హరీశ్‌రావు విమర్శించారు.
‘వందా రెండు వందల కోట్లు ఖర్చుపెడితే ఐదారు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా, ఈ రెండేళ్లలో రెండు రూపాయలు కూడా ఇయ్యలే. రైతాంగం మీద, ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినవ్. మేడిగడ్డ బ్యారేజీ లేకపోయినా నదీ ప్రవాహం నుంచి గూడా కన్నెపెల్లి పంప్‌హౌస్‌ను నడిపి నీళ్లిచ్చే అవకాశం ఉన్నా కావాలనే కాళేశ్వం మీద కక్షగట్టి పండబెడుతున్నవ్. విద్యాసాగర్ రావు సలహా మేరకు.. కేసీఆర్‌గారు శ్రీశైలం దన్నుతో మన రాష్ట్రానికి మేలు జరుగుతదని భావించి పాలమూరు ప్రాజెక్టును కడితే రెండేళ్ల నుంచి పట్టించుకున్న పాపానపోలేవ్. ఇయ్యాల ప్యాకేజీ 3 కింద ఉన్న ఓ బుడ్డ కాలువను పూర్తిచేస్తే 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండె. ఆ అవకాశాన్ని నువ్వు కాలరాసినవ్. పాలమూరుపై పగబట్టినవ్’ అని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు.