Harish Rao | నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత ఉంటుందని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనం దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరి బనకచర్ల ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని హరీశ్‌రావు అన్నారు. దీనిపై గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో అవగాహన కల్పించారని తెలిపారు. పోతిరెడ్డి పాడు వెనుక కాంగ్రెస్ రెగ్యులటరే బనకచర్ల అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు తరలిస్తారని తెలిపారు. పోలవరం నుంచి 2 టీఎంసీల నీటిని తరలించేందుకే బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని అన్నారు. గోదావరి నది ఏడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుందని తెలిపారు. నదీపరివాహక ప్రాంతాల ఆధారంగా ట్రిబ్యునల్ నీళ్ల పంపిణీ చేస్తారని అన్నారు. ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని వివరించారు. ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు అవసరమో ట్రిబ్యునల్ కేటాయిస్తుందని తెలిపారు. ట్రిబ్యునల్ ఒక్కసారిగా నీటి కేటాయింపులు చేస్తే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణ గోదావరిలో 956 టీఎంసీలకు ప్రాజెక్టు రూపకల్పన చేశారని తెలిపారు. నికర జలాల మీద ఆధారపడే ప్రాజెక్టులు కడతారని అన్నారు. తెలంగాణ వాటా ఎంత, ఏపీ వాటా ఎంతో తేలినంకనే ఏపీ ప్రాజెక్టులు కట్టాలి.. కానీ కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో ఉందని బుల్జోజ్ చేసి ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.
200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించేదే బనకచర్ల ప్రాజెక్టు అని హరీశ్‌రావు తెలిపారు. వరద జలాలతోనే బనకచర్ల కడుతామని చంద్రబాబు అంటున్నారని అన్నారు. కానీ ఇంకా నికర జలాల లెక్కే తేలలేదు, వరద జలాలు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చామని గుర్తుచేశారు. 240 టీఎంసీల నీళ్లు వాడుకునేలా 18రకాల అనుమతులు తీసుకొచ్చామని చెప్పారు. 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు నిలిపివేయాలని చంద్రబాబు లేఖ రాశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ ఖమ్మంలో భక్తరామదాసు ప్రాజెక్టు 10 నెలల్లో పూర్తి చేశామని చెప్పారు. పాలేరు నియోజకవర్గానికి కేసీఆర్ సాగునీరు ఇచ్చారని అన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 25 టీఎంసీలు సరిపోతలేదని 40 టీఎంసీలకు పెంచుకున్నామని తెలిపారు. దాన్ని కూడా 2015లో చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసిందని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి డిండి ప్రాజెక్టులను కూడా ఆపాలని బాబు లేఖ రాసిండని అన్నారు. ఇప్పుడేమో ఏపీ, తెలంగాణ రెండు కండ్లు అంటున్నాడని మండిపడ్డారు. నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని చంద్రబాబు చెబుతున్నాడని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఊరుకోలేదని తెలిపారు. కేసీఆర్ మంచినీటి కోసం అంటూ రూ.30వేల కోట్లతో పాలమూరు ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశారని తెలిపారు. నిజాం కాలంలోనే ఆర్డీఎస్ ప్రాజెక్టును కట్టారని పేర్కొన్నారు.
కేసీఆర్ ఒక్క ఏడాదిలోనే తుమ్మిళ్ల ప్రాజెక్టుకు లిఫ్ట్ పెట్టి పారించాడని హరీశ్‌రావు అన్నారు. ఒక ప్రాజెక్టు కట్టాలంటే బోర్డు, అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకోవాలని తెలిపారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుకు బీఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ తమ చేతిలో ఉందని రాత్రికి రాత్రి డీపీఆర్ పంపి ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారని తెలిపారు. 200 టీఎంసీలను హక్కుగా మార్చుకునే కుట్ర ఉందని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు కట్టినం, ప్రజలు వాడుకుంటున్నారు.. ప్రజాధనం వృథా అయిందని, రైపీరియం రైట్స్ ద్వారా తమకు హక్కు కల్పించాలని కోరుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. అందుకే బనకచర్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.